MP కోమటిరెడ్డి దళిత సీఎం డిమాండ్‌పై స్పందించిన ఇన్‌చార్జి థాక్రే

by GSrikanth |   ( Updated:2023-04-17 16:51:12.0  )
MP కోమటిరెడ్డి దళిత సీఎం డిమాండ్‌పై స్పందించిన ఇన్‌చార్జి థాక్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుపై రాహుల్‌గాంధీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రసక్తే లేదని, ఇప్పటికే పలుమార్లు దీనిపై స్పష్టత ఇచ్చామని, ఇకపైన కూడా ఇదే స్టాండ్ ఉంటుందని రాష్ట్ర నేతలకు ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నదని, కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనలో పడేసే ప్రయత్నమేనని, ప్రజలను గందరగోళానికి గురిచేసే కుట్ర అని.. వీటన్నింటినీ ప్రజల్లో అర్థం చేయించాలని సూచించారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని గతంలో చేసిన ప్రకటననే తాజాగానూ రాష్ట్ర నేతలకు అర్థం చేయించారు.

కర్నాటలోని కోలార్ జిల్లాలో రెండు రోజుల క్రితం మొదలుపెట్టిన ప్రచారాన్ని సోమవారం హుమనాబాద్‌‌లో ముగించుకుని ఢిల్లీకి వెళ్ళే క్రమంలో సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా రాష్ట్ర నేతలకు ఈ విషయాన్ని వివరించారు. రాహుల్‌గాంధీ భేటీ అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే మీడియాతో మాట్లాడుతూ, పొత్తుల గురించి గతంలో ఢిల్లీ వేదికగా ఎంపీ కోమటిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందనే పరోక్ష సంకేతాలను ఇచ్చారని, దీనిపై పార్టీ సీరియస్‌గానే ఆయనతో మాట్లాడిందని, ఆ తర్వాత ఆయన కూడా సవరణ, వివరణ ఇచ్చారని గుర్తుచేశారు. పైగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవే తప్ప పార్టీకి సంబంధించినవి కావన్నారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టేటప్పుడు దళితుడే ముఖ్యమంత్రి అని ఇటీవల కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా థాక్రే సీరియస్‌‌గానే స్పందించారు. పార్టీలో ఎప్పుడూ సీఎం అభ్యర్థి గురించి, దళితులకే అవకాశం ఇవ్వాలనే అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలనూ పార్టీ ఆదరిస్తుందని, ఫలానా వర్గం ఎక్కువ.. తక్కువ అనే తేడా ఉండదన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఆయనకు పార్టీ తక్కువేమీ చేయలేదని, ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, కానీ దాన్ని ఆయన నిలుపుకోలేకపోయారన్నారు.

రాహుల్‌గాంధీతో జరిగిన చర్చల సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితిని, పార్టీ బలం గురించి, జరుగుతున్న కార్యక్రమాల గురించి పీసీసీ చీఫ్ రేవంత్, ఇన్‌చార్జి థాక్రే వివరించారు. అరగంటకు పైగా జరిగిన భేటీలో మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ నేతలు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి, మధుయాష్కీ గౌడ్, వీ.హన్మంతరావు తదితరులు కూడా ఉన్నరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని వీరు రాహుల్‌కు వివరించారు.

Advertisement

Next Story