- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ కుంభస్థలంపై కేసీఆర్ గురి.. గుజరాత్ ఎన్నికల్లో BRS పోటీ?
ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కేసీఆర్.. ఏకంగా ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనుకుంటున్నారా..? ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ పైనే గురి పెట్టారా..? అంటే ఔననే సమాధానమే వస్తున్నది. ఇందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా సహకారాన్ని కూడా తీసుకుంటున్నారని తెలుస్తున్నది. తెలంగాణ నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా నివసిస్తున్న సూరత్ జిల్లాలో మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు కొత్త పార్టీ రెడీ అవుతున్నది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లోనూ బరిలోకి దిగేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసుకుంటున్నదని తెలిసింది. జేడీఎస్ సహకారంతో హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలోని రాయిచూర్, బీదర్, గుల్బర్గా, యాద్గిర్, కొప్పల్ జిల్లాల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇకపైన బీఆర్ఎస్ గా రూపాంతరం చెందుతున్నది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టారు. తెలంగాణ నుంచి వలస వెళ్ళినవారు అక్కడ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఎన్నికల ప్రచారానికి సైతం తెలంగాణ నుంచి టీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పేరుతో గులాబీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనున్నది. రాయిచూర్, బీదర్, గుల్బర్గా, కోలార్ జిల్లాల్లో అనుకూలంగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చేసే రాజకీయ పోరును ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రారంభించాలనుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడింది. రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది రాజకీయ పార్టీగా మారింది. ఇప్పుడు దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని కేసీఆర్ భావిస్తున్నారు.
2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీ పేరుతోనే పలు రాష్ట్రాల్లో బరిలోకి దిగాలనుకుంటున్న కేసీఆర్ ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావం ఉంటుందో అనే విషయాలపై ఇప్పటికే అధ్యయనం చేయించారు. తొలుత ప్రశాంత్ కిషోర్ సహకారంతో జాతీయ రాజకీయాల్లో అనుకూల, ప్రతికూల అంశాలపై సర్వే చేయించారు. రాజ్యాంగానికి సవరణలు చేయాలన్న డిమాండ్ కూడా అందులో భాగమేనని తెలుస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు, శక్తులను కలుపుకుని పోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ప్రైవేటు సంస్థలతోనూ వివిధ రాష్ట్రాల్లోని ప్రజా నాడిని రాబడుతున్నారు. టీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా రావడంపై ఆ రాష్ట్రాల్లోని ప్రజల్లో ఎలాంటి స్పందన ఉన్నది?.. అక్కడి పార్టీల శ్రేణులు ఏమనుకుంటున్నాయి?.. పోటీ చేయడానికి అనుకూలంగా ఉండే స్థానాలేంటి?.. బీజేపీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది? కొత్త పార్టీగా రంగంలోకి దిగితే ఓటర్ల నుంచి ఆదరణ ఎలా ఉంటుంది? ఇలాంటి అంశాలపై పబ్లిక్ పల్స్ సేకరిస్తున్నారు. దసరా రోజున పార్టీ పేరును ప్రకటించిన తర్వాత ఈ సర్వే మరింత ముమ్మరం కానున్నది. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోపే అక్కడ రైతు, కార్మిక సంఘాల సహకారంతో భారీ బహిరంగసభలనూ నిర్వహించనున్నారు.
ప్రాంతీయ పార్టీల సహకారం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ పార్టీని పెడుతున్నందున ఆయా రాష్ట్రాల్లో వాటి పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మల్చుకోవాలన్నది కేసీఆర్ భావన. అందులో భాగంగానే అక్కడి వివిధ ప్రాంతీయ పార్టీల సహకారాన్ని కూడా తీసుకోనున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలకు ఆల్టర్నేట్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ పేరుతో ఎంటర్ అయితే ఏ మేరకు కలిసొస్తుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి? తదితరాలపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్ టైటిల్‌తో స్థానికంగా పలుకుబడి ఉన్న పార్టీలు, వాటి నేతలను నిలబెట్టడం ద్వారా విజయావకాశాలు ఏ స్థాయిలో ఉంటాయనే అంశంపైనా వివరాలను సేకరిస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ నుంచి, గుజరాత్‌లో మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా నుంచి సహకారం తీసుకోనున్నారు.
తెలంగాణ వారుండే ప్రాంతాల్లోనే..
పార్లమెంటు ఎన్నికలే కేసీఆర్ లక్ష్యమైనా త్వరలో జరగనున్న గుజరాత్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాలనుకుంటున్నారు. ఆ దిశగా కసరత్తు మొదలైంది. తెలంగాణ ప్రజలు స్థిరపడిన గుజరాత్‌లోని సూరత్, నవ్‌సరి, చొరాసియా అసెంబ్లీ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. చాలా ఏండ్ల క్రితం ఉపాధి కోసం తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి వలస వెళ్ళినా ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మహబూబాబాద్, జనగాం, వరంగల్, ములుగు, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వలస వెళ్లిన నేతన్నలు అక్కడి పవర్‌లూమ్ పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి ఓటు బ్యాంకు ఆ సెగ్మెంట్లలో గణనీయంగా ఉన్నందున బీఆర్ఎస్ ఎంట్రీకి రాస్తా క్లియర్‌గా ఉంటుందన్నది కేసీఆర్ భావన. మరోవైపు కర్నాటకలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం. హైదరాబాద్ స్టేట్‌లో గతంలో భాగంగా ఉండి కర్ణాటకలో విలీమైన రాయిచూర్, బీదర్, గుల్బర్గా, యాద్గిర్, కొప్పల్ జిల్లాలను ప్రాథమికంగా ఎంచుకున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో జరిగిన చర్చల్లో సైతం బీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థికి జేడీఎస్ మద్దతు ఇవ్వడంపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ టీమ్‌లు అక్కడ పర్యటించి అనుకూల పరిస్థితులపై ప్రాథమిక అంచనాకు వచ్చాయి. కర్ణాటకలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి కన్నడ తెలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పంపనున్నారు.