- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల కారెక్కనున్నారా..? ఆయన సైలెన్స్ దేనికి సంకేతం?
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై జరుగుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారని, ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారని ఓ ఆంగ్లపత్రిక వెలువరించిన కథనంతో ఈటల వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఈటల నిజంగానే పార్టీ మారబోతున్నారా? ఇన్నాళ్లు టీఆర్ఎస్‌ను దుమ్మెత్తిపోసిన ఈటల.. తిరిగి అదే పార్టీలోకి వస్తే కేసీఆర్ ఆహ్వానిస్తారా? తనను కేసీఆర్ బలవంతంగా పార్టీ నుంచి పంపించేశారని ఇన్నాళ్లు చెప్పుకున్న ఈటల తిరిగి అదే పార్టీలోకి వెళ్తే గౌరవ మర్యాదలు దక్కేనా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్న ఈ ప్రచారంపై ఈటల మౌనం వహించడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉండబోతోందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల కమలం పార్టీ గట్టిపోటీ ఇస్తుండటంతో బీజేపీని ఎలాగైనా నిలువరించే వ్యూహాలకు కేసీఆర్ పదును పెడుతున్నారనేది నిర్వివాదాంశం. మునుగోడులో టీఆర్ఎస్‌కు చావుతప్పి కన్నులొట్టబోయినంత పని అయింది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తప్పదని గ్రహించిన కేసీఆర్ బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఇందులో భాగంగా ఘర్ వాపసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ లను తిరిగి కారు ఎక్కించుకున్న కేసీఆర్.. తాజాగా ఈటల రాజేందర్ పై దృష్టి సారించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈటల ప్రస్తుతం బీజేపీలో అసంతృప్తితో ఉన్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో మంత్రిగా, ఉద్యమకారుడిగా, అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా పని చేసిన తనకు బీజేపీలోని ఓ వర్గం నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని, అగ్రనేతల నుంచి సైతం సరైన ఆదరణ లభించడం లేదనే అసంతృప్తితో ఉన్నారని అందువల్ల ఆయన బీజేపీలో కొనసాగడంపై సందిగ్ధత నెలకొందనే ఊహాగానాలు చాలా కాలంగా వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
మోడీ పర్యటనలోనూ తనకు రావాల్సిన ప్రాధాన్యత రాలేదనే అసంతృప్తి ఈటలలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతో ఆయన పార్టీ మారుతారనే చర్చ జరుగుతూనే ఉంది. బీజేపీతో అసంతృప్తితో ఉన్న ఈటలను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన్ను సంతృప్తి పరిచేలా ప్రయోజనాలను కల్పించబోతున్నట్టు ఈ కథనం సారాంశం. తిరిగి పార్టీలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఇతర ప్రయోజనాలను కల్పించేందుకు కేసీఆర్ ఆసక్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజా ప్రచారం ఇప్పుడు టీఆర్ఎస్ తో పాటు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఈటల నిజంగానే పార్టీ మారబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చక్కర్లు కొడుతుంటే ఈ విషయంలో ఈటల సైలన్స్ దేనికి సంకేతం అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాజేందర్ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ పెద్దలను కలిసేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరో వైపు కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేస్తున్నారని, అదును చూసి బీజేపీని దెబ్బకొట్టేలా వ్యూహం అమలు కాబోతోందని ప్రచారం జరుగుతుంటే ఈటల మాత్రం ఇటు సోషల్ మీడియా ద్వారా గాని ప్రెస్ మీట్ నిర్వహించి నేరుగా కాని ఆంగ్ల పత్రిక కథనాన్ని ఖండించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఈటల రాజేందర్ కు భారీ ఆఫర్ రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గట్టి పోటీ ఎదురవుతున్న కారణంగా బీజేపీని దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ ఇలా లీకులు ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. ఇది కాకుంటే ఈటలను ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలో దెబ్బతీసేందుకే ఇలా ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు బీజేపీలో సీనియర్లు, జూనియర్లు అనే వర్గాలు ఏర్పడ్డాయని వారిలో కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారని మరి కొంత మంది వాదిస్తున్నారు. ఇవే కాకుండా మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. పార్టీలో తన డిమాండ్ ను పెంచుకునేందుకు ఈటల వర్గమే ఇలాంటి ప్రచారం చేపడుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. తన విషయంలో ఎంత పెద్ద ఎత్తున చర్చ జరిగితే అది తనకు అంతగా కలిసి వస్తుందనే అంచనాలతోనే వ్యూహాత్మకంగా ఈటల ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని వాదన కూడా ఉంది. అయితే ఈటల విషయంలో టీఆర్ఎస్ నేతల వాదన మరోలా ఉంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన ఆయన్ను తిరిగి ఎలా చేర్చుకుంటామని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, ఇన్నాళ్లు టీఆర్ఎస్ ను విమర్శించిన ఈటల తిరిగి ఆ పార్టీలో చేరితే ఆయనకు గౌరవం దక్కుతుందా అని బీజేపీ నేతలు వాదిస్తున్నారట. మొత్తంగా ఈటల విషయంలో జరుగుతున్న ప్రచారం ప్లాన్ వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం స్పష్టం కాకపోయినా ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈటలనే స్వయంగా స్పందించి ఈ పుకార్లకు చెక్ పెట్టే వరకు ఇలాంటి ప్రచారాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Read more: