AP Politics: ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న ఇరుపార్టీల నేతలు.. గుడివాడలో హై టెన్షన్

by Indraja |
AP Politics: ఆ విషయంలో తగ్గేదెలే అంటున్న ఇరుపార్టీల నేతలు.. గుడివాడలో హై టెన్షన్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారి పారీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ముఖ్యంగా నామినేషన్ల నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ నుండి వైసీపీ తరుపున కొడాలి నాని.. అలానే టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఎన్నికల బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో రేపు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని అటు వైసీపీ అభ్యర్థి, ఇటు టీడీపీ అభ్యర్థి పోలీసులను కోరారు. అయితే రెండు పార్టీల అభ్యర్థులు ఓకే రోజు నామినేషన్ వేసేందుకు వీలుపడదని, శాంతిభద్రతల దృష్ట్యా ఎవరో ఒక్కరికే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఇరుపార్టీల అభ్యర్థులు మాత్రం తగ్గేదెలే అంటూ రేపే నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనితో రేపు ఏం జరుగుతుందో అని అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయవర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇరు పార్టీల నేతలు రేపే ఎందుకు నామినేషన్ వెయ్యాలి అని అనుకుంటున్నారు..?

రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్న పార్టీల అభ్యర్థులు ఏ పని చెయ్యాలి అని అనుకున్న మంచిరోజు చూస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు పురోహితులను కలిసి మంచిరోజు చూపించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ ప్రక్రియ దశమి రోజు ప్రారంభం అయినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు.

ఏప్రిల్ 19వ తేదీ ఏకాదశి మంచిందని కొందరు ఆ రోజు నామినేషన్ వేశారు. కాగా ఏప్రిల్ 22 వ తేదీ చతుర్ధశి చాల మంచి రోజు కనుక టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారని సమాచారం. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఇద్దరికీ ఒకే రోజు నామినేషన్ వేసేందుకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు తెలిపారు.

ఏప్రిల్ 22 వ తేదీ చతుర్ధశి మంచి రోజు అయితే, ఏప్రిల్ 23 వ తేదీ పౌర్ణమి కూడా అంతే మంచి రోజు కనుక ఎవరో ఒకరు సర్దుకుని తరువాత రోజు నామినేషన్ వెయ్యొచ్చు. కానీ వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. దీనితో ఇరువురు అభ్యర్థుల్లో ఒక్కరు కూడా వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.

తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అనే ధోరణితో అభ్యర్థులు ఉండడంతో.. వదలమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నటుంది పోలీసుల పరిస్థితి అని అందరూ అనుకుంటున్నారు.

Advertisement

Next Story