ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం భూ దందాలు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Kalyani |   ( Updated:2023-05-22 07:00:17.0  )
ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం భూ దందాలు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ జడ్చర్ల/ నవాబ్ పేట: ధరణి పోర్టల్ ను తీసుకొచ్చి రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను పార్ట్ బీ లో పెట్టి ప్రజలకు విషయం అర్థమయ్యే లోపు ఆ భూములను రాష్ట్ర పాలకులు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని.. ఆ సొమ్ముతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చులు భరిస్తానంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం రుక్కంపల్లి గ్రామంలో భట్టి విక్రమార్క టీపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టీపిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను చేస్తున్న పాదయాత్ర సందర్భంగా ఎక్కడ చూసినా ప్రజలు ధరణి పోర్టల్ వల్ల పడుతున్న ఇబ్బందులను గురించి, విలువైన భూములను కోల్పోయిన అంశాన్ని గురించి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. భూ సమస్యలు తీర్చేందుకే ధరణి పోర్టల్ తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం పేదల నుంచి భూములను లాక్కొని లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భూ దందాలతో వచ్చిన డబ్బులతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలలో ఎంపీ అభ్యర్థుల ఖర్చులను భరించేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ భూ కుంభకోణాలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని భట్టి చెప్పారు.

తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వం కేవలం ఆరు శాతం నిధులను మాత్రమే కేటాయించారని అన్నారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు నోట్ల మార్పిడి చేస్తుందని భట్టి చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత వివిధ పార్టీలలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు టచ్ లోకి వచ్చారని, వారి పేర్లు బహిర్గతం చేయమని ఆయన తెలిపారు.

టీపిసిసి మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో జరిగిన ఫలితాలు వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలోనూ పునరావృతం అవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ పాదయాత్ర మంచి ఫలితాలను ఇవ్వగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన మేలు ఏమీ లేదు అన్నారు. ఎఐసిసి కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎర్రటి ఎండలను లెక్కచేయకుండా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అన్నారు.

కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కార్ ను ఓడించినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీపిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాద్ హాజరవుతున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావు, మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More: భూములపై ‘ఐ మార్క్’.. కేటీఆర్ ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా దందా

Advertisement

Next Story