డిఫెన్స్‌లో జిల్లా ఎమ్మెల్యేలు..! ఆ విషయంలో డైలమా

by Sathputhe Rajesh |
డిఫెన్స్‌లో జిల్లా ఎమ్మెల్యేలు..! ఆ విషయంలో డైలమా
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : నియోజకవర్గం మొత్తం మా గుప్పెట్లోనే ఉంది. ఇక్కడ ఏం జరగాలన్నా ఏ అధికారి రావాలన్నా, ట్రాన్స్ఫర్ కావాలన్నా మేమే చేయాలి. అధిష్టానం కూడా మా వైపే ఉంది. మేము ఏమి చెప్పిన వింటున్న అధిష్టానం మాకు నచ్చిన అధికారులను నియమించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది. ఇంత చేస్తున్న అధిష్టానం కేవలం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదా..? తప్పకుండా మాకే ఇస్తుంది. ఇది నిన్నటివరకు వికారాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేగా భరోసా, నమ్మకం. కానీ ఇప్పుడు దీనికి పూర్తి వ్యతిరేకంగా పరిస్థితులు మారిపోతున్నాయా..? అనే అనుమానాలు ఎమ్మెల్యేలకు వస్తున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది.

ఎమ్మెల్యేలుగా గెలిచినా ఏడాది నుండే అసమ్మతి వర్గం ఏర్పడినప్పటికీ, ఎమ్మెల్యేలు వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. అధిష్టానం దృష్టిలో మనపై మంచి రిపోర్ట్ ఉంది. పైగా మేము ఏం చేస్తున్నామో అన్ని గమనిస్తున్న అధిష్టానం మమ్మల్నే ప్రోత్సహిస్తుంది అనే ధీమాలో ఉన్నారు. కానీ ఆ ధీమా ఇప్పుడు ఎందుకు లేదు, ఎమ్మెల్యేలు అందరు ఢిపెన్స్‌లో ఎందుకు పడాల్సి వచ్చింది..? ఢిపెన్స్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అధిష్టానం దగ్గర తమ బలం నిరూపించుకోవడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎంపీ, మంత్రులను అతిధులుగా పిలిచిమరీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏంటి అనే చర్చ జిల్లాలో బాగా నడుస్తుంది.

ఎమ్మెల్యేల స్వేచ్ఛ తారాస్థాయికి చేరిందా..?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్వేచ్చే ఇప్పుడు పామై వారి మెడకే చుట్టుకుందా అనే అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గం ఏదైనా ఎమ్మెల్యేలే అక్కడ బాస్. వారిని మించి ఎవ్వరు ముందుకు వెళ్ళడానికి లేదు, ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి లేదు. చివరికి అది మున్సిపల్ అయినా, గ్రామా పంచాయితీ అయినా అభివృద్ధి కోసం నిధులు కావాలన్నా ఎమ్మెల్యే వస్తే ఇస్తాం. స్థానిక ఎమ్మెల్యే లేకుండా మంత్రి వచ్చిన గడ్డి పోసతో సమానం అనేలా సీఎం కెసిఆర్, ఎమ్మెల్యేలను అందలం ఎక్కించాడు.

ఇదే అదునుగా భావించిన వాళ్ళు పార్టీ భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధి పక్కన పెట్టి తమ స్వలాభం మాత్రమే చూసుకుంటూ ధరణి సమస్యలను అడ్డుపెట్టుకొని భూ దందాలు చేసి కోట్ల రూపాయలు గడించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతలా అంటే వచ్చే ఎన్నికల్లో అధిష్టానానికి వీళ్ళే పార్టీ ఫండ్ ఇచ్చిమరీ గెలిచేంతగా. ఇదే అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలకే ఎదురు తిరిగి, అధిష్టానం చెంతకు దైర్యంగా వెళ్లి ఈసారి ఎమ్మెల్యే టికెట్ మాకే ఇవ్వాలి అనే స్థాయికి వెళ్ళింది.

దాంతోనే సంపద, పవర్..!

కేసీఆర్ పాలనలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితేనే కావాల్సినంత సంపాదించుకోవచ్చు. పవర్ మన చేతుల్లోనే ఉంటుంది అనేది అందరికి అర్థం అయ్యింది. ఎమ్మెల్యే బాస్‌లు ఇతర నాయకులను ఎదగనివ్వడం లేదు. గతంలో పవర్, పలుకుబడి ఉన్నవారైనా ఇప్పుడు అందరు జీరోలు అయ్యారు. ఎమ్మెల్యే తప్ప ఎవ్వరూ తెరపైకి రాకపోవడంతో అసలు మేము ఉన్నామా..? రాజకీయం చేస్తున్నామా అనే సందేహం కలుగుతుందని సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. మళ్లి తెరపైకి రావాలంటే ఎమ్మెల్యే టికెట్ ఒక్కటే మార్గం అని భావిస్తున్న నాయకులు దైర్యం చేసి మరీ కేసీఆర్, కేటీఆర్ దగ్గరకు వెళ్లి తమ బాధలు చెప్పుకొని టికెట్ కావాలని అడుగుతున్నారని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందని చర్చలు వినిపిస్తున్నాయి.

తెరపైకి ప్రత్యామ్నాయ నాయకులు..

వికారాబాద్ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నియోజవర్గ అభివృద్ధి గాలికి వదిలేసి తన స్వలాభం కోసం హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారాలు చేసాడని, తాండూర్‌లో సైతం అక్ర్రమ వ్యవహారాలు, అక్రమ ఇసుక అమ్ముకొని కోట్లు గడించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎర వేసిన వారిని పట్టించడంలో కీలకంగా వ్యవహరించిన రోహిత్ రెడ్డి ఎన్నికల కోసమే అభివృద్ధి అంటున్నాడనే టాక్ ఉంది. తాండూర్ ప్రజలపై రోహిత్ రెడ్డికి ఏమాత్రం ప్రేమలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, లేదా అయన సతీమణి సునీతా రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తుంది. వికారాబాద్ ఎమ్మెల్యే సైతం తన స్వలాభం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి ప్రత్యేక నిధులు తేలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి ఆనంద్‌కు టికెట్ డౌటేనని, అయన స్థానంలో వడ్ల నందుకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ నడుస్తుంది.

ఇక పరిగి ఎమ్మెల్యే రియల్ దందాలే కాకా, దేవాలయ భూములను సైతం కబ్జా చేస్తూ తన స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో అయన స్థానంలో మనోహర్ రెడ్డికె ఈసారి టికెట్ వస్తుందే చర్చ నడుస్తుంది. వీరి ముగ్గురితో పోల్చితే కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి టికెట్ వ్యవహారం ఫైనల్ వరకు తేలేలా కనిపించడం లేదు. ఈయనపై కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేస్తాడు, ఒకవేళ కొడంగల్ నుండి పోటీ చేస్తే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్..!

అవినీతి ఆరోపణలు, అసమ్మతి వర్గంతో తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేల మెడకు దళితబందు పథకంలో అవినీతి చుట్టుకుంది. దళితబంధు లబ్ధిదారులను ఫైనల్ చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలపై పెట్టడంతో అదే ఇప్పుడు టికెట్ చేజార్చుకునే పరిస్థితి తీసుకువచ్చిందా అనే చర్చ నడుస్తుంది. ఎమ్మెల్యేలతో సమావేశం అయినా ముఖ్యమంత్రి దళితబంధు పథకం కింద మీరు తీసుకున్న కమిషన్‌ల చిట్టా నాదగ్గర ఉందని ఎమ్మెల్యేలను సీఎం బెదిరించాడు. అప్పటి నుండి ఇంతకు వచ్చే ఎన్నికల్లో మాకు టికెట్ వస్తుందా..? రాదా..? అనే డైలమాలో ఎమ్మెల్యేలు ఉన్నారు.

దళితబంధు కింద కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత పిఏలు, సొంత మనుషులు, నాయకులను మధ్యలో పెట్టి రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు కమిషన్ తీసుకున్నారని, ఆ సమాచారం ఇప్పటికే సీఎం దగ్గర ఉందని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ చూస్తుంటే దళితబందు కమిషన్లు అనే చిన్న సాకుతో అవినీతీ ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా దూరం పెట్టెల ఉన్నాడనే చర్చ నడుస్తుంది. ఇంతకు రేపు ఏం జరుగుతుందో..? టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి అంటే ఎన్నికల సమయం వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed