కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం!

by GSrikanth |
కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కర్ణాటక ఎన్నికలను ఓ ప్రయోగశాలగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇక్కడ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తేలడంతో ఇంకాస్త కష్టపడితే అధికారం తమదేనన్న ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో బీజేపీకి చెక్ పెట్టడంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని మరింత డిఫెన్స్‌లో పడేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందుకోసం కర్ణాటకలో అధికార బీజేపీని ఇరుకున పెట్టేలా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే మరో వైపు పార్టీ పరంగా వ్యూహాత్మక నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. నిన్న రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని కన్నడనాట కీలక హామీలు ఇచ్చారు. తాము ప్రధాని నరేంద్ర మోడీలా తప్పుడు హామీలివ్వబోమని తమపై భరోసా ఉంచాలన్నారు.

కాంగ్రెస్‌కు 150 సీట్లను గెలపించి సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు. అయితే రాహుల్ ఓ వైపు హామీలు ఇవ్వగా మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాత పెన్షన్ విధానం అమలులోకి వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీని ఇచ్చిందని ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పారు. అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో హామీలపై కీలక ప్రకటనలు చేసింది. ఆ ప్రకటనలు హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ గెలుపునకు దోహదపడ్డాయనే చర్చ జరిగింది. తాజాగా కర్ణాటక ఎన్నికల సమయంలోనూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా తమ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి మరింత చేరువ చేయాలనే వ్యూహంతో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ అసంతృప్తులనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. దీంతో కన్నడనాట కాంగ్రెస్ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ ప్రయోగాలు చేస్తోందనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed