కేజ్రీవాల్కు అండగా కాంగ్రెస్.. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్

by Javid Pasha |   ( Updated:2023-05-22 15:56:21.0  )
కేజ్రీవాల్కు అండగా కాంగ్రెస్.. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుంది. ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కు పూర్తి అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆప్ కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఇప్పటికే బీహార్ సీఎం నితిశ్ కుమార్ తో పాటు పలు పార్టీల అధినేతలు కేజ్రీవాల్ అండగా నిలిచారు. ప్రజల మద్దతుతో ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన ఓ ప్రభుత్వంపై ఆర్డినెన్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని ఆప్ సహా మిగతా విపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ క్యాపిటల్ సర్వీస్ అథారిటీ ఆర్డినెన్స్ రాజ్యాంగానికి విరుద్ధం అని వారు ఆరోపించారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జూన్ 11న ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు విపక్ష నాయకులకు ఆహ్వానాలు కూడా పంపింది. కాగా అధికారుల నియామకం, బదిలీ వంటి వాటిపై ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి పవర్స్ ఉన్నాయని సుప్రీంకోర్టు మే 11న తీర్పు వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిన కొద్దీ రోజులకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సర్వీస్ అథారిటీ ని ఏర్పాటు చేసింది.

Also Read..

శుభ సమయాల్లో చెడు శకునం రాహుల్.. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా

Advertisement

Next Story

Most Viewed