ఎలిగేడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్ల పర్వం

by Javid Pasha |
ఎలిగేడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య సవాళ్ల పర్వం
X

దిశ, పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల వేడి ఎలిగేడు మండల కేంద్రంలో కాస్త ముందస్తుగానే మొదలైంది. మండల అభివృద్ధిపై ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అభివృద్ధి చేయట్లేదని ప్రతిపక్ష నాయకులు అంటే మా వల్లే అభివృద్ధి జరుగుతుందని అధికార పార్టీ నేతలు గత కొంతకాలంగా ప్రెస్ మీట్ లు పెట్టి బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అభివృద్ధిపై చర్చకు రావాలంటూ ఒకరిపై ఒకరు విసురుకున్న సవాల్లను పోలీసులు భగ్నం చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి జూలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి ధర్మారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

2001 వ సంవత్సరంలో మండల కేంద్రం ఏర్పాటు జరిగినప్పటి నుండి పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి పడకల పెంపుదల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయట్లేదని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎలిగేడు మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి కడిగిపారేస్తున్నారు. దీనికి ఆజ్యం పోసేలా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హథ్ సే హథ్ జోడో యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ఈ డిమాండ్లను తీర్చాలంటూ నెల రోజులు గడువు ఇస్తున్నానని, స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తానంటూ మండల కేంద్రంలో గత పది రోజుల క్రింద నిరాహార దీక్ష చేపట్టారు.

ఎలిగేడు మండలంలోని గ్రామాలకు కనీస బస్సు సౌకర్యాలు కూడా లేవంటూ ఎమ్మెల్యేని పనిచేయలేని దద్దమ్మ అంటూ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏకిపారేశారు. దీనిని ప్రెస్టేజ్ గా తీసుకున్న అధికార పార్టీ స్థానిక నేతలు గతంలో ఐదు సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఈ అభివృద్ధి గుర్తుకు రాలేదా సొంత మండలం అని చెప్పుకునే విజయ రమణారావు జెడ్పిటిసిగా, ఎమ్మెల్యేగా ఈ మండలానికి ఎన్ని రూపాయల అభివృద్ధి చేశాడో బహిరంగ చర్చకు అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలంటూ సవాళ్లు విసిరారు. మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని డబుల్ రోడ్లు, పక్కా భవనాలు, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం అని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారం రాదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇరు వర్గాల సవాల్ల నేపథ్యంలో సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు నేతలను అదుపులోకి తీసుకొని జూలపల్లి, ధర్మారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ రాజకీయ వేడి ఇంకా ఎంత దూరం దారితీస్తుందో అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటుందా పోలీస్ స్టేషన్, జూనియర్ కాలేజ్ ఏర్పాటు జరుగుతుందా ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం బస్సు ద్వారా మెరుగు పడుతుందా వేచి చూడాల్సిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నేతలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, నాయకులు మోహన్ రావు, మండిగా రాజనర్సు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాడ కొండల్ రెడ్డి, సర్పంచులు ఐలయ్య, కొండయ్య రాజా, విజయేందర్ రెడ్డి, నాయకులు సతీష్, పోచాలు, వినోద్, అనిల్, బాపయ్య తదితరులు కాంగ్రెస్ నేతలు మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్ రెడ్డి , సర్పంచ్ వెంకటేశ్వరరావు నాయకులు సంతోష్ రావు, రాజేశ్వర్ రెడ్డి, అమ్మల శ్రీనివాస్, తిరుపతి, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story