పవన్ కల్యాణ్‌కు చింతమనేని బంపరాఫర్.. ఓకే అంటే తన సీటు ఇస్తానని ప్రకటన

by Javid Pasha |
పవన్ కల్యాణ్‌కు చింతమనేని బంపరాఫర్.. ఓకే అంటే తన సీటు ఇస్తానని ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో రాజకీయం కాస్త రంజుగా మారుతుంది. చంద్రబాబు కుప్పం నుంచి..వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తారన్న సంగతి తెలిసిందే. మరో ప్రధానమైన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఇంకా ఖరారు కాలేదు. దీంతో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనే తిరిగి పోటీ చేస్తారా లేక ఈసారి మరో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. తిరుపతి, పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పవన్ కల్యాణ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తానంటే తన నియోజకవర్గం నుంచి పోటీ చేయోచ్చు అని ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ కోసం తన నియోజకవర్గాన్ని త్యాగం చేస్తానని అంతేకాదు పవన్ కల్యాణ్‌ను భుజాన ఎత్తుకుని గెలిపించుకుంటానని చింతమనేని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అడగకుండానే పవన్ కల్యాణ్ తన సీటును త్యాగం చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

చింతమనేని త్యాగం

దెందులూరు నియోజకవర్గం ఒకప్పుడు చింతమనేని ప్రభాకర్ అడ్డా అనడంలో ఎలాంటి సందేహం లేదు. దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొందిన సంగతి తెలిసిందే. చింతమనేని ప్రభాకర్ మాస్ లీడర్ కావడంతో గ్రామీణ ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైలుకు సైతం వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు జీనర్మరణ సమస్యలా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో దెందులూరు టికెట్ చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేసేశారు.

ఇలాంటి తరుణంలో తన సీటు త్యాగం చేస్తానంటూ చింతమనేని ప్రభాకర్ కొత్త భాష్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. పవన్ దెందులూరు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించేశారు. అంతే కాదు పవన్ కల్యాణ్‌ను భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చారు. జనసేన అధినేత దెందులూరు కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు. చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

ఆకట్టుకునేందుకే ఆఫర్ ఇచ్చారా?

ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై జవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో కౌంటర్ ఇస్తున్నారు. మాజీమంత్రి పేర్ని నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స సత్యనారాయణలు కూడా పవన్ పై అటాక్ చేస్తున్నారు. ఇదే తరుణంలో కాపు ఉద్యమ నేతలను సైతం పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఉసుగొల్పుతుంది. ఇది సరిపోదన్నట్లు తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ఘాటు లేఖ రాశారు. ఇలా పవన్ కల్యాణ్‌కు కాపు సామాజిక వర్గం దూరం అవుతున్న తరుణంలో తాను పవన్ కోసం సీటు త్యాగం చేస్తానంటూ చింతమనేని ఆఫర్ ఇవ్వడం రాజకీయంగా దుమారం రేపుతోంది. చింతమనేని వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు చేశారా లేక మరేదైనా ఉద్దేశంతో చేశారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది.

నాడు చింతమనేని వర్సెస్ పవన్

2019లో ప్రజాపోరాట యాత్రలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. చింతమనేని దళితులను ఇబ్బంది పెడుతున్నారని..ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. తాను గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సైగ చేస్తే చింతమనేనిని కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారంటూ హెచ్చరించారు. 16 ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తరిమేశానని గుర్తు చేశారు. ఖబడ్దార్ చింతమనేని అంటూ వార్నింగ్ ఇచ్చారు. చింతమనేని లాంటి యక్తులను వెనుకేసుకొస్తున్న టీడీపీకి తానెందుకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రభాకర్ లాంటి వ్యక్తి సింగపూర్‌లో ఉంటే కర్రతో కొడతారని, సౌదీ అరేబియాలో అయితే తల తీసేస్తారని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు అటు చింతమనేని ప్రభాకర్ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాను అసెంబ్లీ రౌడీనే అని.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రౌడీయిజం చేస్తానని ప్రభాకర్ సమర్థించుకున్నారు. పవన్‌కు చెందిన టీవీ ఛానెల్‌లో తనను అసెంబ్లీ రౌడీగా చిత్రీకరించారని.. ఆ సమయంలో వచ్చిన మా అబ్బాయి.. నాన్నా నువ్వు అసెంబ్లీ రౌడీవా అని అడిగాడని గుర్తు చేశారు. రౌడీయిజం చేస్తే మక్కెలు విరగ్గొట్టిస్తానని ప్రభాకర్ హెచ్చరించారు. తనకు నీతి, నిజాయితీ ఉందని.. బజారు మనిషిలా ఎన్నడూ ప్రవర్తించలేదని చింతమనేని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ విమర్శలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా చింతమనేని ప్రభాకర్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed