30 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Kalyani |
30 వేల ఎకరాలు అమ్మకానికి పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ, నవాబుపేట: ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి ఇప్పుడు ఎక్కడ కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలోని విలువైన 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం పీపుల్స్ మార్చ్ యాత్రలో భాగంగా గురుకుంట చేరుకొని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు బీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికార యంత్రాంగం అసైన్డ్ భూములను అమ్మకానికి పెట్టిందని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలోని బీద, బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకుదెరువు కోసం ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పంచి పెడితే నేడు అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి లబ్ధిదారులను బెదిరించి స్వాధీనం చేసుకొని అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఐడీపీఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల భూములను కూడా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్నారు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వం అసైన్డ్ భూముల అమ్మకానికి పాల్పడుతుందని ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు.

అలనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి బీద బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను దక్కించుకున్న ధీరరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి బెదిరించి తమ వశం చేసుకున్న అసైన్డ్ భూములను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సీఈఓ గా వ్యవహరిస్తూ ప్రైవేట్ సంస్థలకు వాటిని కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ భూములను ఆరు నెలలు కాపాడుకోవాలని, ఆ తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించినవేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని ఆ తిరుగుబాటును ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు ప్రదీప్ గౌడ్, దుష్యంత్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story