అవినాష్ రెడ్డి అరెస్ట్ లో కేంద్రం జోక్యం లేదు.. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి

by Javid Pasha |
అవినాష్ రెడ్డి అరెస్ట్ లో కేంద్రం జోక్యం లేదు.. బీజేపీ నాయకురాలు పురందేశ్వరి
X

దిశ ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ చేస్తున్న దర్యాప్తులోనూ, ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టులోనూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాయచోటిలోని సాయి శుభ కల్యాణ మండపంలో బుధవారం బీజేపీ రాజంపేట కార్యవర్గ సమావేశానికి పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కడప - బెంగుళూరు వయా రాయచోటి నుండి వెళ్లే రైల్వేలైన్ ను క్యాన్సిల్ చేయాలంటూ కేంద్రానికి రాష్ర్ట ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారంటూ ముఖ్యమంత్రి కి ఈ ప్రాంతం పై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి నుండి బి.జె.పిని పటిష్టం చేసి ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల నుండి దేశానికి చేసిన సేవ, రాష్ర్టాలకు అందించిన సహకారం ద్వారా ప్రజలకు జరిగిన మేలును ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ప్రజలకు చేరువవుతామన్నారు.

రాష్ర్టంలో అరాచక, విధ్వంస పూరిత పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలో నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించే విధంగా రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో నేడు ప్రభుత్వం వుండడం బాధాకరమన్నారు. వై.ఎస్.ఆర్.సి.పికి చెందిన సర్పంచులు నేడు తమకు కేటాయించిన నిధులను ఇవ్వలేని దీనావ్యవస్థలో ప్రభుత్వం వుందన్నారు. ఇన్ని నిధులు ప్రక్కదోవ పట్టించిన రాష్ర్ట అభివృద్ధి శూన్యమన్నారు. ఆంధ్ర రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని బి.జె.పి చూస్తుంటే అవినీతిలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నం వై.ఎస్.ఆర్.సి.పి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఇన్ ఛార్జ్ సాయి లోకేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed