సీఎం అయ్యాక కూడా అదే ఏడుపా..? రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్

by Ramesh Goud |
సీఎం అయ్యాక కూడా అదే ఏడుపా..? రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ఆరోపించారు. గజ్వేల్ (Gajwel) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) కి గజ్వేల్‌కు ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధమని, కేసీఆర్ గజ్వేల్‌ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, భౌతిక దాడులు, పోలీస్ కేసులు ఉండేవని, కేసీఆర్ వచ్చిన తర్వాత గజ్వేల్‌ను ప్రేమ, అభిమానాలకు, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దారని చెప్పారు. గజ్వేల్‌లో అనునిత్యం అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కొనసాగించారని, దేశ ప్రధానమంత్రిని (Prime Minister) కూడా గజ్వేల్‌కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు.

కేసీఆర్ ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లతో అక్కా చెల్లెళ్లను పలకరిస్తున్నారని, కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మిషన్ భగీరథ నీళ్ల (Mission Bhagiratha)కు కోత పెట్టిందని మండిపడ్డారు. గతంలో మొదటి అంతస్తుకు నీళ్లొచ్చేవి అని, ఇవాళ నీళ్లే సరిగ్గా రావడం లేదన్నారు. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూములకు ధరల్లేక ఆత్మ విశ్వాసం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడే ప్రాంతంగా ఉండేదని, కేసీఆర్ కృషితో ఇటు మల్లన్నసాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగల పారే గోదావరి జలలాతో ధాన్యలక్ష్మి తాండవం చేస్తున్నదని, ఇవాళ గజ్వేల్‌లో బంగారమోలె పంటలు పండుతున్నాయని తెలిపారు. ఎకరం 4, 5 లక్షలు లేని భూముల ధరలు 1 కోటి నుంచి 4 కోట్ల వరకు పెరిగాయని, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి దరిద్రపు పాలన వల్ల గజ్వేల్‌లో ధనలక్ష్మి మాయమైపోతున్నదని, భూముల ధరలు పడిపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎవరికన్నా ఆపద ఉండి అమ్ముకుందామంటే, కొనే దిక్కు లేకుండా అయిపోయిందని అన్నారు.

కేసీఆర్ రాకముందు గజ్వేల్‌లో పాఠశాలలు పాత బూత్ బంగ్లాలవలె ఉండేవని, కానీ కేసీఆర్ గజ్వేల్‌ను బ్రహ్మండమైన ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చిండని చెప్పారు. గజ్వేల్‌లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ కనపడుతారని, గజ్వేల్‌కు కలగానే మిగిలిన రైలును తెచ్చింది కేసీఆరేనని, ఎరువులు దింపే రాక్ పాయింట్ ను పెట్టించాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇవాళ చిల్లర మాటలు, కుళ్లు మాటలు మాట్లాడుతున్నారని, ఆయన పాలనలో గజ్వేల్‌కు ఒక్క రూపాయి పని అయినా జరిగిందా చెప్పాలన్నారు. కేసీఆర్ మంజూరు చేస్తే, టెండర్లు అయి, నడుస్తున్న రూ. 181 కోట్ల రూపాయల పనులు రేవంత్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ గజ్వేల్‌ను కండ్లల్లో పెట్టుకున్నాడని, గజ్వేల్ అభివృద్ధి మీద ఏడ్చినవు.. కుళ్లినవు.. ఇవాళ సీఎం అయ్యాక కూడా అదే ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ గర్జిస్తేనే మల్లన్నసాగర్ గేట్లు తెరిచాడని, రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ జనం అల్లాడుతున్నారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed