- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దిశ' స్పెషల్ ఇంటర్వ్యూలో సంచలనాలు బయటపెట్టిన Bandi Sanjay
దిశ, కరీంనగర్ బ్యూరో : 'ప్రజా కోర్టులో కేసీఆర్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉరి తీయబోతున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పిస్తూ అందరినీ ఏకం చేసేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాం. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శ్రీలంకా తరహా బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది. బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజిన్ పాలనతో అప్పులను అధిగమించి అభివృద్ధి చేస్తాం. పేదల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అవినీతి రహిత పాలన అందిస్తాం. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కొండను తవ్వి తొండను పట్టినట్టుగా ఉంది. కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఎల్ సంతోష్ పై కేసు. ఆ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటాం. ఇక గాంధీభవన్‌కు టులెట్ బోర్డు పక్కా.' అని బీజేపీ స్టేట్ చీఫ్ బీఎస్కే అన్నారు. నేటి నుంచి ఆయన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్న సందర్భంగా దిశ స్పెషల్ ఇంటర్వ్యూ.
దిశ : సుదీర్ఘ పాదయాత్ర కొనసాగుతున్నారు? యాత్ర లక్ష్యం నెరవేరిందా?
బీఎస్‌కే : కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. బంగారు తెలంగాణ అప్పుల కుప్పగా మారింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించి, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడమే నా పాదయాత్ర ప్రధాన ఉద్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గోల్కొండపై కాషాయ జెండాను రెపరెపలాడించి పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే యాత్ర అంతిమ లక్ష్యం. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే అనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకపోయింది. తెలంగాణ ప్రజలు బీజేపీని అక్కున చేర్చుకుంటున్నారని చెప్పడానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనం.
దిశ : ప్రజలంతా మీ వైపే ఉంటే మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది..?
బీఎస్‌కే : మునుగోడులో ఉపఎన్నికలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. ఆయన వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి కమ్యూనిస్టు పార్టీలు తమ సిద్ధాంతాలను సీఎం కాళ్ల ముందుంచాయి. అవినీతి సొమ్ముతో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడంతో పాటు మద్యాన్ని ఏరులై పారించారు. టీఆర్ఎస్‌కు ఓటేయకపోతే పింఛన్లు కట్ చేస్తామని, కేసులు పెడతామని తీవ్రస్థాయిలో ఓటర్లను బెదిరింపులకు గురిచేశారు. చివరకు చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న రీతిలో టీఆర్ఎస్ గెలిచింది. గతంలో మునుగోడులో బీజేపీకి 12 వేల ఓట్లు వేస్తే, ఈసారి ఏకంగా 86 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి బీజేపీ బలం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మునుగోడు ఫలితాలు కూడా టీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేయేనని చెప్పకనే చెప్పాయి. మర్రి శశిధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి అనేక మంది లెజండరీస్ మా పార్టీలో చేరుతున్నారు. మునుగోడు తీర్పు తర్వాత కూడా చాలామంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజా జీవితంలో పక్షపాతం లేకుండా సేవ చేయాలనుకునే వారందరికీ మా పార్టీ స్వాగతం పలుకుతున్నది. రానున్న కాలంలో మరిన్ని చేరికలుంటాయి.
దిశ : ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావు హత్యపై మీ కామెంట్?
బీఎస్‌కే : రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు హత్య అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగడా సానుభూతిని ప్రకటిస్తున్నా. పోడు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరువల్లే ఓ అధికారి ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చింది. పోడు భూములకు పట్టాలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నాయి. కుర్చీ వేసుకుని పట్టాలిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల సమయంలో ఆ ఆశ చూపించి ఓట్లు వేయించుకున్నారు. ఇంతవరకు ఒక్కరికీ పట్టా ఇవ్వలేదు. వారిపై దాడులకు ఉసిగొల్పుతూ ఫారెస్ట్ అధికారులను బలిపశువులను చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. సాగు చేసుకుంటున్న వాళ్లపై దాడులు చేయించడం దారుణం. దూడను పాలు తాగమంటూనే బర్రెను తన్నమని సీఎం చెబుతున్నారు. శ్రీనివాసరావు హత్యలో ముమ్మాటికీ ముఖ్యమంత్రే హంతకుడు. హత్య జరిగేందుకు ప్రేరేపించిన వారే మొదటగా దోషులవుతారని చట్టం చెబుతున్నది. సెక్షన్ 302 కింద కేసీఆర్‌పై హత్య కేసు నమోదు చేయాలి. అధికారంలో ఉన్నందున ప్రస్తుతం చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ప్రజా కోర్టులో ఆయనకు ఉరిశిక్ష ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉరి తీయబోతున్నారు.
దిశ : మంత్రులు, టీఆర్ఎస్ నేతలపై దాడుల పేరుతో కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే ఆరోపణలపై మీరేమంటారు..?
బీఎస్‌కే : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేస్తే టీఆర్ఎస్ దొంగలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఆయన వ్యాపారాలు, విద్యా సంస్థల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై గత 6 నెలలుగా పక్కా సమాచారం సేకరించే ఐటీ అధికారులు దాడులు చేసి విచారిస్తున్నారు. ఐటీ రెయిడ్స్ జరుగుతున్నది ఒక వ్యాపారవేత్తపైనే అనే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ నేతలు సుద్దపూసలైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీఓలు జారీ చేయడం వెనక ఆంతర్యం ఏంటో తెలంగాణ సమాజానికి సీఎం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతించి వారి నిజాయితీని నిరూపించుకోవాలి. ప్రతి పక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో సానుభూతిని పొందాలనే ప్రయత్నాలు చేస్తూ అబద్ధాలు చెబుతున్నాయి. బీజేపీలో చేరిన అరకు ఎంపీ గీతను సీబీఐ అరెస్టు చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మిత్ర పక్ష పార్టీల నేతలపైనా ఐటీ దాడులు జరిగాయి. అవినీతికి దూరంగా ఉండాలన్నదే ప్రధాని మోడీ విధానం.
దిశ : నంబర్ వన్ రాష్ట్రంగా ఉండటాన్ని చూసి ఓర్వలేకే కేంద్రం దాడులతో ఇబ్బందులు పెడుతున్నదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది కదా?
బీఎస్‌కే : తెలంగాణ ఎందులో నంబర్ వన్? అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. దోచుకోవడం, ఆ సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడంలో టీఆర్ఎస్ నంబర్ వన్. అబద్ధపు ప్రచారాలు, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో, స్కాముల్లో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉంది.
దిశ : విడతల వారీగా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు?
బీఎస్‌కే : ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారితో మమేకం కావాలనేది మా లక్ష్యం. అది జరగాలంటే భౌగోళికంగా ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విడతల వారీగా పాదయాత్ర చేస్తున్నాం. అటు పార్టీ బాధ్యతలతో పాటు ఇటు నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నా. ప్రజా మద్దతుతో ఇప్పటి వరకు 1148 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. రాష్ట్ర ప్రజల సపోర్టుతో నాలుగు విడతల పాదయాత్ర విజయవంతం అయింది. ఐదో విడత కూడా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది. జనంలోనే ఉండటం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడమే ప్రధానమైన పనిగా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగుతున్నా. అధికార పార్టీ వైఫల్యాల వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన తెలంగాణ సమాజానికి భరోసాతో కూడిన బాసట అవసరం ఉన్నది. అందుకే పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నాను. ఫాంహౌజ్‌లో పడుకునే వాళ్లకు, గెస్ట్ హౌజ్‌లో టైం పాస్ చేసే వాళ్లకు ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన ఎలా కనుబడుతుంది? కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయింది. అప్పుల్లో మునిగింది. మళ్లీ టీఆర్ఎస్‌కు అధికారమిస్తే తెలంగాణను శ్రీలంక మాదిరిగా బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొస్తారు. బీజేపీకి అధికారమిస్తే డబుల్ ఇంజిన్ పాలన కొనసాగిస్తాం. కేంద్రం సహకారంతో అప్పుల బాధలను అధిగమించి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ రద్దు చేయబోం. అవసరమైతే మరింతగా మెరుగు పరుస్తాం. ప్రజలకు నేను చేసే అప్పీల్ ఒక్కటే. బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. తెలంగాణ అమరవీరుల కలలను సాకారం చేస్తాం.
దిశ : రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఆర్థిక సంక్షోభం, కుంభకోణాలపై మీరేమంటారు?
బీఎస్‌కే : ఎనిమిదేండ్లలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ఖజానాను పూర్తిగా వృథా చేసింది. ఆర్థికంగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావడం లేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం లేదు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసహనం, వ్యతిరేకత పెరిగిపోయింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షాత్తు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. వీటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయాలను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు.
దిశ : ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ జాతీయ నాయకుడి పేరు వెలుగులోకి వచ్చింది కదా..?
బీఎస్‌కే : ఇదంతా కేసీఆర్ అండ్ కో ఆడుతున్న డ్రామాలో భాగమే. ఆ ఫాం హౌజ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందింది. అక్కడికి వచ్చింది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్ ది. పోలీసులు కూడా ఆయన ఆడమన్నట్టే ఆడారు. ఈ ఘటనలో ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ వాళ్లే.. బాధితులూ ఆ పార్టీకి చెందిన వారే. ఈ వ్యవహారంలో డబ్బులేమైనా దొరికాయా? చేతులేమైనా మారాయా? అంటే అదీ లేదు. బీజేపీపై బురద చల్లే కుట్రలో భాగమే ఇదంతా. కేసీఆర్ నీచ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనమేం కావాలి? బీఆర్ఎస్ పేరుతో జాతీయస్థాయి గుర్తింపు కోసం సంతోష్ జీ పేరును ఉపయోగించుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అది బెడిసి కొట్టడంతో మళ్లీ కొత్త డ్రామాకు ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. అందుకే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. అయినా జనం పట్టించుకోవడం లేదు. ఆయన మోకాళ్ల యాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా జనం నమ్మరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో అంటకాగుతున్నది. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ మేమే ఆచితూచి ఆలోచించి పార్టీలోకి తీసుకుంటున్నాం. మరి కొద్ది రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా ఖాళీ కాబోతున్నది. గాంధీభవన్‌కు 'టు లెట్' తగిలించే పరిస్థితి రాబోతున్నది.
దిశ: రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ఉద్యమాలకు ప్రజల నుంచి సానకూలత రావడం లేదంటున్నారు కదా?
బీఎస్‌కే : రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకుని పోరాటాలు చేయేలేదు. చేయబోము. సమస్య తీవ్రతను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నాం. 317 జీవోపై జరిగిన పోరులో నాతో సహా అనేక మంది బీజేపీ కార్యకర్తలు జైలు పాలయ్యాం. పోడు భూములు, వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో జరిగిన పోరాటంలో మా కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేశారు. కాళ్లు చేతులు విరిగాయి. మాకు పోరాటాలు, నిర్బంధాలు కొత్తేం కాదు. ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావిస్తాం. ఎలాంటి ఉద్యమాలకైనా, ప్రాణ త్యాగాలకైనా మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. తెలంగాణ ప్రజలు విశ్వాసంతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల తీర్పు ఇందుకు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికలెప్పుడు వచ్చినా.. గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడటం ఖాయం. కుటుంబ, అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడి పేదల ఆధ్వర్యంలో తెలంగాణ అమరులు కలలు కన్న పాలనను కొనసాగించడం ఖాయం