బండి సంజయ్ కి అమిత్ షా ప్రశంసలు

by Javid Pasha |   ( Updated:2023-03-17 11:50:42.0  )
బండి సంజయ్ కి అమిత్ షా ప్రశంసలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. శుక్రవారం తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ విజయం తెలియజేస్తోందన్నారు. అమిత్ షా ట్వీట్ పై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. టీచర్ ఎమ్మెల్సీ విజయం స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబ అవినీతి ప్రభుత్వాన్ని సబ్బండ వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. బీజేపీ నేతృత్వంలో ప్రజల సమిష్టి ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటోందని అన్నారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఎదురుచూస్తున్నారు అనడానికి ఏవీఎన్ రెడ్డి విజయమే నిదర్శనం అన్నారు. మోడీ నేతృత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం, జాతీయ పార్టీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా వ్యవహారం సాగుతున్న వేళ బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం ఆ విజయంపై నేరుగా అమిత్ షా స్పదించడం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story