రెండు గంటల్లో మోడీ, అమిత్ షా, అదానీని జైల్లో వేస్తా.. ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-02-27 10:42:52.0  )
రెండు గంటల్లో మోడీ, అమిత్ షా, అదానీని జైల్లో వేస్తా.. ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐని తనకు అప్పగిస్తే రెండు గంటల్లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, అదానీని అరెస్ట్ చేసి జైలులో వేస్తానని సంచలన ప్రకటన చేశారు. మనీశ్ సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ ఆదివారం సీబీఐ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన ఎమ్మెల్యే సంజయ్ సింగ్ తో పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. పీఎం మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలులో వేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశంలోనే గొప్ప విద్యాశాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆప్ నేత మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారన్నారు. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. తమ మంత్రుల అరెస్ట్ వల్ల తమ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, మొత్తం మంత్రులను అరెస్ట్ చేసినా తమ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. మనీశ్ సిసోడియా అరెస్ట్ ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూలిపోతుందని ఆప్ నేతలు అన్నారు.

Advertisement

Next Story