ఆ విషయంలో సపోర్టు ఇవ్వకపోతే రేపటి సమావేశానికి డుమ్మా.. కాంగ్రెస్ కు ఆప్ అల్టిమేటం

by Javid Pasha |
ఆ విషయంలో సపోర్టు ఇవ్వకపోతే రేపటి సమావేశానికి డుమ్మా.. కాంగ్రెస్ కు ఆప్ అల్టిమేటం
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 23న బిహార్ లోని పాట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ తదితర పార్టీల నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశానికి రావాలని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా నితీశ్ కుమార్ ఆహ్వానించారు. కాగా తాజాగా దీనిపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఉద్యోగుల నియామకం, బదిలీకి సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తేనే ఆ సమావేశానికి హాజరవుతామని కేజ్రీవాల్ అల్టిమేటం జారీ చేశారు.

కాంగ్రెస్ తమకు మద్దతు తెలపకుంటే సమావేశానికి వచ్చేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని పలు పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప దాదాపు అన్ని విపక్ష పార్టీల నేతలు కేజ్రీవాల్ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. కాగా ఆప్ వల్లే తాము చాలా ఎన్నికల్లో నష్టపోతున్నామని, ఆ పార్టీ తమకు ప్రత్యమ్యాయంగా మారిందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును ఆప్ చీల్చడం వల్లే చాలా చోట్ల తాము ఓడిపోయామని హస్తం పార్టీ అగ్రనేతలు ఓ అభిప్రాయానికి వచ్చినందు వల్లే ఆప్ ను దూరంగా పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story