ఆ ప్రకటనతో పొలిటికల్ పార్టీలు అలెర్ట్..

by Sridhar Babu |
ఆ ప్రకటనతో పొలిటికల్ పార్టీలు అలెర్ట్..
X

దిశ, భద్రాచలం: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతున్నాయి.

దూసుకుపోతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి..

ఎమ్మెల్సీ ఎన్నికలకు నెలరోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నిక జరిగే ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి మూడు పాత జిల్లాల పరిధిలో ఓట్లు ఉండటంతో అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ముందు చూపుతో నోటిఫికేషన్‌కి ముందు నుంచే అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తూ గ్రాడ్యుయేట్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మద్దతుదారులను వెంటబెట్టుకొని ఇప్పటికే కొందరు అభ్యర్థులు రెండు రౌండ్లు, మరికొందరు ఒక రౌండ్ పూర్తి చేశారు. ఎన్నికల తేదీ ప్రకటించడంతో ప్రచారం లో దూసుకపోతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రాథేయపడుతున్నారు. తాము గెలిస్తే ఫలానా పనులు చేస్తామంటూ స్థానిక‌ సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు.‌ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విపక్షాలు, స్వతంత్రులు ఒక్క చాన్స్ ఇస్తే ప్రశ్నించే గొంతుకలవుతామని ఓటర్లకి భరోసా కల్పిస్తున్నారు.

ఓటర్లు చేజారిపోకుండా నేతల‌ పాట్లు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను ఆకట్టుకొనేలా రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల‌ నాయకులు వ్యూహాలు అమలు చేస్తున్నారు.‌ పార్టీ సహకారంతో ఎన్‌రోల్ చేసిన వారితోపాటు తటస్థ ఓటర్లను జతపర్చి ఒక సమూహంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేస్తున్నారు. ఓటర్లు చేజారకుండా, ఇతర పార్టీల వలలో పడకుండా కాపుగాచేలా 25 మందికి ఓ బాధ్యుడిని రాజకీయ పార్టీలు నియమిస్తున్నట్లు సమాచారం. పని విభజనతో సత్పలితాలు వచ్చేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి పోలింగురోజు వరకు ఓటర్లను కనిపెట్టుకొనేలా లీడర్లు పార్టీ క్యాడర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు.‌ వాట్సప్ గ్రూపుల ద్వారా ఓటర్లను ఆకట్టుకొనే విధంగా పోస్టులు పెడుతున్నారు.‌ దాదాపు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ ఎన్నికల‌ ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రలోబాలతో ఓటర్లకి ఇప్పటి నుంచే నాయకులు ఎర వేస్తున్నట్లు సమాచారం.

విద్యావంతులకు హితబోధనా..‌?

నాయకుల ముసుగులో పెద్దగా చదువులేని కొందరు వ్యక్తులు వచ్చి ఎవరికి ఓటు వేయాలనేది పట్టభద్రులైన తమకే హితబోధ చేయడం పట్ల కొందరు గ్రాడ్యుయేట్ ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ చదివిన తమకు పోటీలో ఉన్నవారిలో ఎవరు బెటర్ అనేది ఆలోసించి ఓటు వేసే జ్ఞానం కూడా లేదా? తమ వద్దకు వచ్చి ఫలానా వారికి ఓటు వేయమని వత్తిడి చేయడం ఎంత వరకు సబబు అనే అభిప్రాయం చాలా మంది గ్రాడ్యుయేట్లలో వ్యక్తమవుతుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పట్టభద్రులనే తప్పుదోవ పట్టించే రాజకీయం సమాజానికి ఎంత మేరకు మేలు చేస్తుందనేది గ్రాడ్యుయేట్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story