కాళేశ్వరం కాలువకు రాజకీయ గ్రహణం

by Aamani |
కాళేశ్వరం కాలువకు రాజకీయ గ్రహణం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కాళేశ్వరం కాలువ పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. ప్రజాప్రతినిధుల పంతం కారణంగా పదమూడేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్యాకేజీ-27 పనులను కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి తీసేయటంతో బిల్లులు సకాలంలో అందక కాంట్రాక్టరు ‘చేతు’లెత్తేశారు. దీంతో తొలి కాంట్రాక్టును రద్దు చేయగా.. కొత్త వారికి మిగతా పనులు అప్పగించారు. ఫలితంగా సర్కారుపై రూ.66 కోట్ల అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే సాగునీరు ఇస్తామని భావించగా.. ఇంకా మరో రెండు, మూడేళ్ల సమయం పట్టనుంది. గతంలోనూ, ప్రస్తుతం కూడా రాజకీయ కారణాలు, విబేధాల వల్లనే నిర్మాణ పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది..!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మల్ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పనులు చేపట్టారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో చెరో 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు చేపట్టారు. ప్యాకేజీ-27 ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాలు, ప్యాకేజీ-28 ద్వారా ముధోల్ నియోజకవర్గంలో 50వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ప్యాకేజీ-27కు సంబంధించి 2008లోనే టెండరు పిలిచి రూ.714కోట్లతో సుశీ ఇన్ ఫ్రా అనే సంస్థకు పనులు అప్పగించారు. అప్పట్లో పనులు ప్రారంభించగా.. రాజకీయ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు 2008 నుంచి 2016వరకు ఎనిమిదేళ్ల కాలంలో కేవలం వరద కాల్వ పనులు చేపట్టారు. 8ఏళ్లు ఆలస్యమైనా.. సదరు నిర్మాణ సంస్థ పాత ఎస్ఎస్ఆర్ రేట్లతోనే 2016లో పనులు మొదలు పెట్టి శరవేగంగా చేపట్టారు. సుమారు 63శాతం పనులను పూర్తి చేయగా.. మళ్లీ కథ మొదటికే వచ్చింది.

ప్యాకేజీ-27 పనులు కాళేశ్వరం కార్పొరేషన్‌లో ఉండగా.. పనులు చేసిన ప్రకారం బిల్లులు చెల్లించేవారు. 2016నుంచి 2018వరకు బాగానే పనులు చేయగా.. ఆ ప్రకారంగా బిల్లులు చెల్లించారు. ఈ ప్యాకేజీ పనులను కార్పొరేషన్ నుంచి తీసేయటంతో.. సకాలంలో బిల్లులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఏడాదికిపైగా బిల్లుల చెల్లింపు లేకపోవటంతో సుమారు రూ.100కోట్లకుపైగా పేరుకుపోయాయి. గతంలో మాదిరిగానే కార్పొరేషనులోనే కొనసాగించాలని సదరు సంస్థ ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. సర్కారు నుంచి సానుకూల స్పందన లేదు. మరోవైపు బిల్లుల చెల్లింపులు కూడా నిలిపేయటం, ఏడాదిపైకి నిధులు విడుదల చేయకపోవటంతో సదరు కాంట్రాక్టు సంస్థ పనులు చేసేది లేదని చేతులెత్తేసింది. తమ బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు విన్నవించినా.. అసలే కదలిక లేకపోవటంతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. అసలు 2019లోనే పనులు పూర్తయితే.. 2020లో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యానికి గండి పడింది.

పదమూడేళ్లుగా సాగుతున్న ఈ పనులను రూ.714 కోట్లతో చేపట్టగా.. ఇప్పటికే రూ.448 కోట్ల పనులు సుశీ సంస్థ పూర్తి చేసింది. దీంతో మిగిలిన నిర్మాణాల పూర్తికి రూ.332 కోట్లతో తాజాగా టెండరు పిలిచి పనులు ప్రారంభించారు. పదమూడేళ్ల నాటి అంచనాలతో పనులు చేపట్టగా.. పనుల్లో జాప్యం కావటంతో నిర్మాణ వ్యయం పెరిగింది. సుమారు రూ.66 కోట్ల వరకు అదనంగా సర్కారుపై భారం పడింది. ఇక 2019లో పనులు పూర్తయితే.. 2020ప్రారంభంలోనే ఆయకట్టుకు సాగునీరు ఇవ్వవచ్చని భావించారు.

కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి ఈ ప్యాకేజీ పనులను తొలగించి.. బిల్లులు చెల్లించకుండా ఉండటంతో రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. కాంట్రాక్టు సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి చెందినది. తెలంగాణ సర్కారులోని పెద్దలు వ్యూహాత్మకంగా సదరు సంస్థ వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనులను కార్పొరేషన్ నుంచి తొలగించారనే ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాలతోనే 2008, 2018లో రెండు సార్లు కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులకు అడ్డంకిగా మారారని తెలుస్తోంది. సాగునీరు కూడా సకాలంలో అందకపోగా.. రెండు, మూడేళ్లు ఆలస్యమవుతోంది.

Advertisement

Next Story