ప్రాణం పోతే పైసలిచ్చారు.. నేరం ఎవరిది.. శాపం ఎవరికి..?

by Anukaran |   ( Updated:2021-08-02 21:58:14.0  )
ప్రాణం పోతే పైసలిచ్చారు.. నేరం ఎవరిది.. శాపం ఎవరికి..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఓ మరణంతో వచ్చిన డబ్బులు ఆ కుటుంబాన్ని తట్టి లేపాయి. పరామర్శల తంతూ సాగుతోంది. కానీ ఆ మరణంతో ఆ కుటుంబం అనుభవిస్తున్న బాధను తొలగించేదెవరూ? పోయిన ప్రాణాన్ని తీసుకొచ్చెదెవరూ అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కాయా కష్టం చేసి తన ముగ్గురు పిల్లలను డిగ్రీలు చదివించినా.. ఉద్యోగాలు దొరకక జాతరలో బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారిని చూస్తూ ఆ తండ్రి పడుతున్న మనో వేదన అంతా ఇంతా కాదు. స్వరాష్ట్ర కల సాకారం అయితే ఉద్యోగాలు వస్తాయని కలలు కని పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా పొట్ట చేత పట్టుకుని బ్రతకాల్సిన దుర్భర జీవనం గడపాల్సి వస్తుందని ఉహించలేకపోవడం ఆ అభాగ్యుడిదా?

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఇది. అంకూస్ మియా, యాకూబ్ దంపతులు కలో గంజో తాగుతూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు కొడుకులను కూడా డిగ్రీ చదించారు. మూడో కొడుకు అయిన షబ్బీర్ డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని పెద్దపల్లిలో ఐటీఐ ఎలక్ట్రిషియన్ డిప్లొమా పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అన్వేషన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదే క్రమంలో తనతో పరిచయం అయిన యువతిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు. తన కళ్ల ముందే డిగ్రీలు చదివిన ఇద్దరు అన్నలు జాతరలో బొమ్మలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, తోళ్లను విక్రయిస్తూ తనవంతుగా కుటుంబ భారన్ని పోషిస్తున్న తండ్రిని చూస్తూ చలించిపోయాడు. తనపై ఆధారపడి తన జీవితంలోకి వచ్చిన సహచరిణిని కూడా పోషించలేకపోతున్నానని మనోవేదనకు గురయ్యాడు. ఉద్యోగం కోసం నిర్మించుకున్న కలల సౌధాలు ఆచరణలోకి వచ్చేదెన్నడూ అన్న అంతర్మథనంతో రోజులు గడుపుతున్నాడు. చివరకు చావే శరణ్యం అని భావించిన షబ్బీర్ జమ్మికుంట రైల్వై స్టేషన్‌లో సూసైడ్ చేసుకున్నాడు. నెలల క్రితమే తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యకు, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, సోదరులను క్షమాపణలు కోరుతూ లేఖ రాసి మరీ చనిపోవడమే అందరిని కలిచివేసింది. ఉన్నత చదువులు చదివినా లాభం లేకపోవడమే అతని మరణానికి కారణం.

సాయం సరిచేసేనా..?

షబ్బీర్ ఆత్మహత్య విషయం తెలిసి బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రూ. 2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రూ. 3 లక్షల సాయం అందించారు. అయితే షబ్బీర్ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగు పర్చుకునేందుకు ఈ సాయం ఆసరగా నిలుస్తుంది కావచ్చు కానీ ఆ తల్లిదండ్రులకు మిగిల్చిన పుత్ర శోకాన్ని తీర్చేదెవరు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టి పట్టుమని పది నెలలు కాకముందే విగత జీవిగా మారిపోయిన భర్తను చూసి అచేతనురాలైన ఆ అభాగ్యురాలి మనసులోని బాధను తీర్చేదెవరు. ఇంతకీ షబ్బీర్ ఆత్మహత్యకు కారకులు ఎవరు.? ఆ పాపపు శాపాన్ని అనుభవిస్తున్నదెవరూ అన్నదే ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. మరణం తరువాత వచ్చే ధనం కన్నా అర్థాంతర చావు లేకుండా నివారించేందుకు ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలకు షబ్బీర్ మరణంతో అయినా ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed