పసుపు రైతుల జీవితాలతో రాజకీయం..!

by Shyam |   ( Updated:2021-01-21 12:15:43.0  )
పసుపు రైతుల జీవితాలతో రాజకీయం..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పసుపు పంట కోతకొచ్చింది. ఎప్పటి నుంచో నానుతూ వస్తున్న మద్దతు ధర వ్యవహారం మాత్రం కొలిక్కి రావడం లేదు. బాధ్యత మీదంటే మీదని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపాన్ని నెట్టేసుకుంటున్నాయి. శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం ఆలోచించింది మాత్రం లేదు. ఈ క్రమంలోనే పసుపు పంట కోతకు రావడంతో నిజామాబాద్ , కామారెడ్డి, జగిత్యాల జిల్లాలలో ఈ ఇష్యూపై మళ్లీ రాజకీయం మొదలైంది. గత ఎన్నికలలో పోటీ చేసిన రైతులతో పసుపు మద్దతు ధర కోసం ఎంపీ అర్వింద్​ ఈ నెల 23న చర్చలు జరుపనున్నారు. 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఉండడంతో ఆయన ద్వారానైనా తమ సమస్యకు పరిష్కారం దొరక్కపోదా అనే ఆశతో రైతులున్నట్టు తెలుస్తోంది.

మూడేళ్లుగా రాజకీయ వేడి

పసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు వంటి విషయాలతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మూడేళ్లుగా రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి. పసుపు రైతు అవసరాన్ని ఆయా పార్టీలు లబ్ధి పొందడానికి మాత్రం ఉపయోగించుకుంటున్నాయి. న్యాయం జరగడం లేదననే ఆవేదనతో వందల సంఖ్యలో రైతులు గత పార్లమెంట్​ ఎన్నికల బరిలో నిలిచారు. మద్దతు ధర కోసం ఎన్నోసార్లు రోడ్డెక్కారు. ఎప్పుడు ఏదో ఒక పసుపు ఉద్యమం జరుగుతూనే ఉంది.

నిజామాబాద్​ ఏరియాలో అధికం

దేశవ్యాప్తంగా 47,760 హెక్టార్లలో పసుపు పంట సాగైతే 17 వేల హెక్టార్లు నిజామాబాద్ జిల్లా నుంచే ఉండడం గమనార్హం. మొక్కజొన్న, సోయా పంటలను పసుపులో అంతరపంటలుగా సాగుచేయడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఎకరానికి 1.20 లక్షల పెట్టుబడి అవుతుండగా సుమారుగా 18 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రూ.ఐదు వేల ధరతో పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఆశించిన స్థాయిలో కనీస మద్దతు ధర లేకపోవడంతో నష్టాల పాలవుతున్నట్టు రైతులు వాపోతున్నారు.

రైతులను తప్పుదోవ పట్టించి

ఇది వరకే ఎంపీ అర్వింద్​ కారణంగా నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ రీజినల్​ ఎక్స్​టెన్షన్​ సెంటర్​ ఏర్పాటు చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. దానితో పాటు క్లస్టర్ స్కీంను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుత పరిస్థితులలో పసుపు బోర్డు కన్నా ఇదే మంచి వ్యవస్థ అని, దీంతో పసుపు రైతులకు మేలు చేస్తామని కేంద్రం చెప్పుకొస్తున్నది. రాష్ర్ట ప్రభుత్వ వైఖరి కారణంగా పసుపు రైతులకు నష్టం వాటిల్లుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ప్రాంతీయ పంటలకు ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధమైన ధరలుంటాయని, వాటికి కేంద్రమే నేరుగా ధర ప్రకటిస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయమై రైతులకు స్పష్టత లేకపోవడం, కొన్ని పార్టీలు రైతులను తప్పుదోవ పట్టించడం కూడా పసుపు రాజకీయానికి ఆజ్యం పోసేదిగా మారిందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story