- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా వాటర్‌పై పొలిటికల్ హీట్.. కమిటీపై ఏపీ పెత్తనమా..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదాలు పరిశీలన కమిటీ మెడకు చుట్టుకున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించేందుకు నియమించిన కమిటీ నుంచి వివరణ తీసుకునేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. పరిశీలన కమిటీపై ఏపీ పెత్తనమేమిటని ప్రశ్నించింది. అదేసమయంలో కమిటీ నిర్ణయాలను సైతం తప్పు పట్టింది. కేంద్ర జలశక్తి నియమించిన కమిటీ.. ఏపీ సూచనను పరిగణలోకి తీసుకోవడమేమిటంటూ ప్రశ్నించింది. కేంద్రమే ఆదేశాలిస్తే ఎందుకు వెనకడగు వేశారంటూ అడిగింది. దీనిపై కమిటీ చైర్మన్, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనాను వివరణ ఇవ్వాలంటూ సూచించింది. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాలతో మళ్లీ పరిశీలించేందుకు కసరత్తు మొదలైంది. జలశక్తి సెక్రటరీ నుంచి ఆదేశాలు రాగానే రాయలసీమ ఎత్తిపోత నిర్మాణ పనుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఎందుకు వెళ్లలేదు..?
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశంలో రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై మొదట్నుంచీ వివాదం సాగుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. అటు అపెక్స్ కౌన్సిల్‌లో కూడా ఇదే అంశాన్ని కేంద్రం ముందుంచారు. ఆ తర్వాత కూడా సంగమేశ్వరం దగ్గర పనులు మొదలుపెట్టడంతో తెలంగాణ అభ్యంతరంపై కేంద్రం స్పందించింది. అసలు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించాలని ప్రత్యేక కమిటీని నియమించింది. మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కూడా దీనిపై వివరాలు అడగడంతో నివేదిక ఇవ్వడం అనివార్యంగా మారింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలన కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా నేతృత్వంలో కేఆర్ఎంబీ కార్యదర్శి రాయిపురే, బోర్డు సభ్యుడు (విద్యుత్తు) ఎల్.బి.ముతంగ్, కేంద్ర జలసంఘం (హైదరాబాద్)లో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్‌రావుతో కమిటీ వేశారు.
ఏప్రిల్‌లోనే కమిటీని నియమించగా.. ముందుగా అదేనెల 11న వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏపీ నుంచి రిప్లై రాలేదు. దీంతో మళ్లీ ఏప్రిల్19, 20 తేదీల్లో రాయలసీమ పరిశీలనకు వస్తామని, నోడల్అధికారిని నియమించాలంటూ మరో లేఖ పంపించారు. కానీ, ఏపీ మాత్రం అనుమతి ఇవ్వలేదు. రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగడం లేదని, అంతేకాకుండా ఆ పరిధి సీఈ, ఎస్ఈలకు కరోనా పాజిటివ్‌వచ్చిందని, కమిటీ రావద్దంటూ ఏపీ చెప్పడంతో పర్యటనను అర్థాంతరంగా ఒక్కరోజు ముందు అంటే ఏప్రిల్ 18న రాత్రి వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
రాయలసీమ పరిశీలనకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరడంపై కేంద్ర జలశక్తి తప్పు పట్టింది. తాజాగా సీఎం కేసీఆర్మరోసారి దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్రం కమిటీ నుంచి వివరాలు తీసుకుంది. అసలు ఏపీని అనుమతి అడగడంలో అర్థం లేదంటూ కేంద్ర జలశక్తి అధికారులు వెల్లడించారు. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలతోనే కమిటీ ఏర్పాటు చేశామని, పనులను పరిశీలించేందుకు కమిటీకి అధికారాలున్నాయని, అంతేకానీ ఏపీని ఎందుకు అనుమతి అడిగారని ప్రశ్నించింది. అంతేకాకుండా ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతలను నిర్మిస్తున్నది కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోనే ఉంటుందని తెలంగాణ లేఖలో వివరించిందని, పోతిరెడ్డిపాడు పరిధిలో ప్రతి అణువణువూ కృష్ణా బోర్డులోని ప్రతి ఒక్కరికి తెలిసిందేనని, ప్రస్తుతం కమిటీలో కూడా బోర్డు నుంచే ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇంకా నోడల్ అధికారి ఎందుకంటూ ప్రశ్నించింది. ఈ కమిటీకి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం కూడా తెలియనది కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి అనుమతి కోసం లేఖ రాయడం వ్యర్థమంటూ అసహనం వ్యక్తం చేసింది.
వాయిదా ఎందుకు వేసుకున్నారు..?
కేంద్రం నియమించిన కమిటీ ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని, అంతేకానీ వాయిదా ఎందుకు వేసుకున్నారంటూ కేంద్రం సీరియస్ అయినట్లు ఇరిగేషన్ అధికారులు చెప్పుతున్నారు. ఈ కమిటీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు జవాబుదారీగా ఉంటుందని, కానీ కనీస సమాచారం లేకుండా పరిశీలనకు వెళ్లడానికి ఎందుకు వాయిదా వేసుకున్నారంటూ వివరణ ఇవ్వాలంటూ కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ పంపింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రటరీ నుంచి లేఖను పంపించారు. పరిశీలనకు వెళ్లాలని ఆదేశాలిస్తే రాష్ట్రాల అనుమతి కోసం లేఖ రాయడం, మళ్లీ ఏపీ తిరుగు లేఖ పంపడం, కరోనా సాకుగా వద్దంటూ ఏపీ చెప్పడం, దాంతో పరిశీలనను వాయిదా వేసుకోవడంపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది.
త్వరలోనే పరిశీలన..!
ప్రస్తుతం ఈ అంశం మళ్లీ వివాదానికి ఆజ్యం పోస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా వాటర్‌పై మాటల యుద్ధం నడుస్తోంది. అటు కేంద్రం కూడా నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించాలని, అవసరమైతే కేంద్ర బలగాల సాయంతో వెళ్లాలంటూ సూచించింది. దీంతో పరిశీలనకు వెళ్లడం కమిటీకి అనివార్యమవుతోంది. అయితే, దీనిపై జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రటరీ నుంచి సమాచారం రావాలంటూ ఎదురుచూస్తోంది. సమాచారం రాగానే వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ రెండు రోజల వ్యవధిలోనే పరిశీలన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.