పోలీసులు అస్సలు కనికరించలే.. 3 గంటలు సతాయించారు : ఆశావర్కర్

by Anukaran |
పోలీసులు అస్సలు కనికరించలే.. 3 గంటలు సతాయించారు : ఆశావర్కర్
X

దిశ, హుజూర్ నగర్ : కరోనా విపత్తులోనూ నిర్విరామంగా సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు కనీస గౌరవం లభించడం లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తమ్ముడిని హాస్పిటల్‌కు తీసుకువెళ్లి వస్తున్న తనను పోలీసులు కనికరం లేకుండా సతాయించారని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన ఆశా వర్కర్ అన్వర్ సుల్తానా వాపోయింది. తనకు జరిగిన చేదు ఘటన పట్ల ఆదివారం విడుదల చేసిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. సుల్తానా కథనం ప్రకారం.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తమ్ముడిని, ఓ ఆటో మాట్లాడుకుని హుజూర్ నగర్ నుండి ఖమ్మంలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్ళింది. అక్కడ స్కానింగ్ చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అడ్మిషన్ కోసం యాజమాన్యం రూ.20 వేలు చెల్లిచాలని అడగగా.. సరిపడేంత డబ్బు లేకపోవడంతో తమ్ముడిని తీసుకుని హుజూర్ నగర్ బయలు దేరింది. తిరుగు ప్రయాణంలో హుజూర్ నగర్ బైపాస్ రోడ్డు వద్ద, కోదాడ సీఐ, ఎస్ఐ, ముగ్గురు పోలీసులు అడ్డుకున్నారు.

కాళ్ళవాపు, అయాసంతో ఇబ్బందిపడుతున్న తమ్ముడిని చూసి కనికరించకుండా.. నిర్ధాక్షిణ్యంగా చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారని చెప్పింది. అత్యవసర పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చిందని చెప్పినా వినకుండా.. మూడు గంటలు సతాయించారని కన్నీటి పర్యంతమైంది. రూ.1100 ఫైన్ వేసి, స్టేషన్‌కు వచ్చి ఫోన్ తీసుకోవాలని లేకుంటే, ఆటో సీజ్ చేస్తామని ఇష్టారీతిన మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనాపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్ వర్కర్లకు కనీసం గౌరవం కూడా దక్కడం లేదని, ఆశా వర్కర్ యూనిఫాంలో ఉన్న తన పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించిదని చెప్పారు. ఉన్నతాధికారులు ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed