ప్రార్థనలు వారి వంతు..పరేషాన్ వీరి వంతు

by Sridhar Babu |
ప్రార్థనలు వారి వంతు..పరేషాన్ వీరి వంతు
X

దిశ, కరీంనగర్:
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఉంది ప్రభుత్వ అధికారుల పరిస్థితి. నిజాముద్దీన్ మర్కజ్ మసీదు వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారిని పట్టుకోవడం అధికారులకు ఇప్పుడు సమస్యగా తయారైంది. ప్రార్థనల కోసం వెల్లిన వారిలో కొంతమందిని గుర్తించినప్పటికీ ఇంకా ఎంతమంది వెళ్లారు అన్న వివరాలు దొరకడం లేదు. రిజర్వేషన్ చేయించుకుని ట్రైన్లలో, ఫ్లైట్లలో వెల్లిన వారి వివరాలు సేకరించగలిన అధికార యంత్రాంగానికి జనరల్ టికెట్లు తీసుకుని వెల్లిన వారెంత మంది, వాహనాల్లో వెళ్లిన వారు ఎంతమంది అన్న లెక్కలు తేలడం లేదు.

ఢిల్లీ వెళ్లివచ్చిన వారి నుంచి తెలుసుకుంటున్న సమాచారంతో మిగతా వారిని క్వారంటైన్‌కు తరలించడమే అసలు సమస్యగా తయారైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా కొంతమంది ఇళ్లు వదిలి వెల్లి పారిపోవడంతో పాటు, మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో వారి ఆచూకీ దొరకడం లేదని సమాచారం. దీంతో వారిని ఎలాగైన పట్టుకోవాలని పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మొబైల్ నెంబర్ స్విఛ్చాప్ అయినా టవర్ లోకేషన్‌ను అంచనా వేస్తూ వారు ఏఏ ప్రాంతాల్లో తలదాచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగానికి చిక్కకుండా తప్పించుకుంటున్న వారి బంధువులు, స్నేహితుల ద్వారా కూడా ఆచూకీ కనుగోనేందుకు యత్నిస్తున్నారు. అడ్రస్ దొరకని వారి పరిస్థితి ఇలా ఉంటే పాజిటివ్ వచ్చిన వారిని కలిసిన డైరక్ట్ కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించడం కూడా యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. కొంతమందిని ముందుగానే గుర్తించి ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కు పంపించడంతో వారు కలిసిన కొద్దిమందిని గుర్తించడం సులువయింది. కాని కొంతమంది మర్కజ్ వెళ్లి వచ్చామని అధికారులకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకుని తిరిగి చాలామందిని కలిశారు. వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్లో లేక అధికారులు సమాచారం సేకరించడం వల్లే పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, వారు ఎంతమందిని వ్యక్తిగతంగా కలిశారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పాజిటివ్ కేసుగా నమోదైన వారు డైరక్ట్ కాంటాక్ట్ అయిన వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తే వారు మరొకరిని కలిసే అవకాశం ఉండదనీ, దీంతో కరోనా వ్యాపించకుండా అక్కడితోనే నిలువరించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాని డైరక్ట్ కాంటాక్ట్ అయిన వ్యక్తులు సెకండ్ కాంటాక్ట్ కావడం వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పట్టువదలని విక్రమార్కుని వలె ప్రయత్నిస్తూనే ఉంది. ఓ వైపున ఇతర రాష్ట్రాలకు వెళ్లొచ్చిన వారు, ఫారిన్ కంట్రీస్‌కు వెళ్లొచ్చిన వారు నేరుగా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిని క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం పిలుపునిస్తూనే మరో వైపున అనుమానితుల కోసం హంటింగ్ కొనసాగిస్తూనే ఉంది. ఉద్దేశపూర్వకంగా తప్పించుకుని తిరుగుతున్న వారు చిక్కిన తర్వాత పరీక్షల్లో పాజిటివని తేలితే వారిపై క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా తమ గుట్టు తెలియకుండా జాగ్రత్త పడటం ఆ సమయంలో వారు విధులకు హాజరు కావడమో లేక సహ ఉద్యోగులను కావడమో చేశారు. దీంతో వీరివల్ల సహచర ఉద్యోగులకు కూడా వ్యాధి ప్రబలే ప్రమాదం తయారైంది. ఈ కారణంగానే రెవెన్యూ, పోలీసు డిపార్ట్‌మెంట్లు మర్కజ్ మసీదు వద్దకు వెళ్లి వచ్చిన వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఆయా శాఖల అధికారులు ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి.

Tags: delhi nizamuddin markaz meeting, corona (covid-19) positive cases, revenue, police dept

Next Story

Most Viewed