రోడ్డెక్కితే బండి సీజ్‌

by Sridhar Babu |

దిశ‌, ఖ‌మ్మం : ఖ‌మ్మం జిల్లా పోలీసులు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. జిల్లాలో 7 పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డంతో అధికార యంత్రాంగ‌మంతా మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది. ప్రధాన కూడ‌ళ్ల‌పై పోలీస్‌ సిబ్బంది ప‌హారా కాస్తున్నారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌చ్చిన వారిపై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. వారం కిందటి వ‌ర‌కు రోడ్ల‌పైకి వ‌చ్చిన‌వారిని కౌన్సెలింగ్‌తో స‌రిపెట్టిన అధికారులు ఇప్పుడు మాత్రం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

లాక్‌డౌన్ అమ‌లులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 952 వాహ‌నాల‌ను సీజ్ చేశారు. 312 మందిపై కేసులు న‌మోదు చేశారు. మ‌ద్యం విక్రయిస్తున్న న‌లుగురు వ్యాపారుల‌పై కేసులు న‌మోదు చేశారు. రూ.3 ల‌క్ష‌ల‌కు పైగా విలువ చేసే మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి తెరిచిన 46 షాపుల‌ను సీజ్ చేయ‌డంతోపాటు వ్యాపారులపై కేసులు న‌మోదు చేశారు.

సామాజిక దూరం పాటించ‌కుండా స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించే వారిపైనా కేసులు న‌మోదు చేయాల్సి వ‌స్తుంద‌ని జిల్లా పోలీస్‌శాఖ హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం రాత్రి పోలీస్‌, రెవెన్యూశాఖ‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండా వైరా రోడ్డులోని ఓ కాల‌నీలో నిరుపేద‌ల‌కు బియ్యం పంపిణీ చేస్తున్న యువ‌కుల‌ను పోలీసులు హెచ్చరించినట్లు స‌మాచారం.

పోలీస్‌, రెవెన్యూ శాఖ‌ల‌కు ముంద‌స్తు స‌మాచారం అంద‌జేస్తే బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో సామాజిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు.

కోల్డ్‌ స్టోరేజీల్లో మిర‌ప పంట‌ను నిల్వ చేసుకునేందుకు వ‌స్తున్న రైతుల‌తో కొంత‌మంది వ్యాపారులు బేర‌సారాల‌కు దిగ‌డంపై పోలీస్ అధికారులు తీవ్రంగా ప‌రిగ‌ణించారు. బుధ‌వారం ఖ‌మ్మం మార్కెట్‌లోకు స‌మీపంలో ఉన్న ఓ కోల్డ్ స్టోరేజిలో పంట‌ను నిల్వ చేసుకునేందుకు వ‌స్తున్న రైతుల‌ను దాదాపు 50 నుంచి 60మంది రైతులు అడ్డ‌గించారు. స‌రుకును విక్ర‌యించాల‌ని ఒత్తిడి చేశారు. వ్యాపారుల విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో కొంత‌మంది వ్యాపారులు, మిగ‌తావారిని
పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. 17మంది వ్యాపారుల‌పై కేసులు న‌మోదు చేశారు.

Tags: Lockdown, Police, patrol, strictly, covid 19 effect, lockdown

Advertisement

Next Story