కరోనా.. కామ్రెడ్స్ కట్టడే టార్గెట్ !

by Sridhar Babu |
కరోనా.. కామ్రెడ్స్ కట్టడే టార్గెట్ !
X

దిశ, కరీంనగర్: దేశంలో అన్ని ప్రాంతాల బలగాలు కరోనా కట్టడికి పనిచేస్తుంటే అక్కడి బలగాలు ఎక్స్‌ట్రా డ్యూటీలు చేస్తున్నాయి. వైరస్ ప్రబలకుండా లాక్‌డౌన్, కర్ఫ్యూ, బార్డర్లలో చెక్‌పోస్టులను పర్యవేక్షించడంతో పాటు మావోయిస్టులను కట్టడి చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపున కరోనా ఎలా సోకుతుందో తెలియని భయం… మరో వైపు మావోయిస్టులు ఎటు నుండి దాడులు చేస్తారోనన్న ఆందోళనతో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కారణంగా అన్ని ప్రాంతాల్లో పోలీసులు లాక్‌డౌన్ అమలు చేస్తూ ప్రజలను బయటకు రాకుండా నిలువరించేందుకు పనిచేస్తుండగా, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం పోలీసులు, పారా మిలటరీ బలగాలు అదనంగా మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు కంటిమీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉంటున్నాయి.

తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌లోని పూర్వ బస్తర్ జిల్లాల్లో బలగాలు రెండు దిక్కులా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. తెలంగాణాలో సివిల్, సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రే హౌండ్స్ విభాగాలకు చెందిన వారు, మహారాష్ట్రలో సివిల్, సీ 60 బెటాలియన్స్, సీఆర్పీఎఫ్ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌లో సివిల్, డిస్ట్రిక్ట్ రిజర్వూ గార్డ్స్ (డీఆర్జీ), సీఆర్పీఎఫ్ బలగాలు అటు కరోనా కంట్రోల్ కోసం ఇటు మావోయిస్టుల కార్యకలాపాలను నిలువరించేందుకు పనిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి ఎలా సోకుతుందో తెలియని పరిస్థితుల్లో పోలీసులు విధులు నిర్వర్తించడమే ఓ సవాల్ అయితే మావోయిస్టులను కంట్రోల్ చేయడం మరో సవాల్‌గా మారింది సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న బలగాలకు. మూడు రాష్ట్రాలను ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరంగా చేయాల్సి వస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య అటవీ‌ప్రాంతం కేంద్రంగా మావోయిస్టులు కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని అందుకున్నాయి. దీంతో మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు 24 గంటలూ పహారా కాయాల్సి వస్తోంది. అదను చూసి మావోయిస్టులు దాడులు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. మూడు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో మావోయిస్టుల కట్టడి కోసం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నారు. లాక్‌డౌన్ విధించిన తరువాత గడ్చిరోలి జిల్లాలో ఇన్‌ఫార్మర్ పేరిట ఒకరిని, ఛత్తీస్‌గఢ్‌లో అసిస్టెంట్ పోలీసుతో పాటు మరొకరిని మావోయిస్టులు చంపేశారు. అలాగే పలు‌చోట్ల ఎదురు కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న బలగాలన్ని అటు లాక్‌డౌన్‌తో పాటు మావోయిస్టులను ఏరివేసేందుకు పనిచేస్తున్నాయి.

Tags: corona virus, lockdown, Maoists, police, paramilitary forces, Maharashtra, Chhattisgarh, Telangana, intelligence

Advertisement

Next Story