- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్కా దందాపై గురి తప్పింది
దిశ, వాజేడు/ చిట్యాల: నిషేధిత గుట్కా విక్రయాలపై నిఘా కరువైంది. ఏజెన్సీ ప్రాంతంలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి అర్ధరాత్రి వేళ అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలైన వాజేడు వెంకటాపురం తదితర మండలాలకు తరలించి బహిరంగంగానే విక్రయిస్తున్నారు. వాజేడు వెంకటాపురం మండలంలోని ప్రతి కిరాణా షాపుల్లో నిషేధిత గుట్కా అంబర్ ప్యాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ టు వెంకటాపురం
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి వెంకటాపురం మండలానికి నిషేధిత గుట్కా ప్యాకెట్లు వాహనాల ద్వారా తరలించి భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారు. కాక అక్కడి నుంచి మారుమూల గ్రామాలకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వాజేడు వెంకటాపురం మండలాల్లోని వివిధ గిరిజన గ్రామాల్లో గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిషేధిత గుట్కా ప్యాకెట్లపై నిఘా కరువవడంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీంతో జోరుగా విక్రయాలు జరిపిన వ్యాపారులు లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ తతంగం కొన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారులు సైతం నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయాలపై అంతగా పట్టించుకోకపోవడంతో వారి వ్యాపారం జోరుగా సాగుతోంది.
మత్తులో యువత
నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జోరుగా సాగుతుండడంతో గిరిజన యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గుట్కా ప్యాకెట్లు తింటూ చెడు వ్యసనాలకు గురవుతున్నారు. పోలీసు యంత్రాంగం అడపాదడపా నిషేధిత గుట్కా విక్రయాలపై దాడులు నిర్వహించి చేతులు దులుపుకోవడంతో గుట్కా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి నిషేధిత గుట్కా ప్యాకెట్ల విక్రయాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జోరుగా అమ్మకాలు
చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో గుట్కా దందా జోరుగా కొనసాగుతుంది. మూడు మండలాలతో పాటు, గ్రామాల్లోని వివిధ కిరాణ దుకాణాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొందరు బడా వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి పొగాకు ఉత్పత్తులను కొనుగోళ్లు చేసి రాత్రివేళ్లలో తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.? వారానికి ఒకసారి ద్విచక్రవాహనాలపై కిరణ షాపులకు సరఫరా చేస్తూ.. అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది.
చిరువ్యాపారులపైనే చర్యలు..!
గుట్కా అక్రమ వ్యాపారంపై సంబంధిత అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు జరుపుతున్న దాడుల్లో చిరువ్యాపారులు మాత్రమే పట్టుబడుతున్నారు. బడా వ్యాపారులు చిక్కడంలేదని ఆరోపణలున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పెద్ద మోతాదులో గుట్కాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.? పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ గుట్కా వ్యాపారులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు, హుకుం జారీ చేస్తే నామ్‌కేవాస్తుగా షాపుల్లో తనిఖీలు నిర్వహించి గుట్కాలు,అంబార్ ప్యాకేట్లను స్వాధీనం చేసుకుని వ్యాపారులను వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి.