- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులూ..సెక్యూరిటీ ఫెయిల్యురా? ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యురా?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి మిస్సయిన తుపాకులు మూడేళ్ల తరువాత ఓ గొర్రెల కాపరి ఇంట్లో లభ్యం కావడం పోలీసుల వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. అసలా ఆయుధాలు స్టేషన్ దాటి ఎలా వెళ్లాయి ? ఓ సామాన్యుని ఇంట ఎలా ప్రత్యక్షమయ్యాయి అన్న ప్రశ్నలకు ఇంతవరకూ జవాబులు లభించలేదు.
గత గురువారం అక్కన్నపేటలో కాంపౌండ్ వాల్ నిర్మాణం విషయంలో వచ్చిన గొడవతో దేవుని సదానందం ఏకె 47తో కాల్పులు జరిపాడు. సంఘటన జరిగిన తరువాత రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సదానందంను పట్టుకున్నారు. అతను వాడిన ఏకే47 మూడేళ్ల క్రితం హుస్నాబాద్ పోలీసుల వద్ద మిస్సయిందిగా గుర్తించారు. దీంతో సదానందం వద్ద 9 ఎంఎం కార్బైన్ గన్ కూడా ఉంటుందని అనుమానించారు. వారి అనుమానం నిజం అయింది. సదానందంను అదుపులోకి తీసుకోగానే అతనిచ్చిన సమాచారంతో అక్కన్నపేటలోని అతని నివాసంలో సోదా చేయగా కార్బైన్ గన్ కూడా దొరికింది. దీంతో మూడేళ్లుగా మిస్టరీగా మారిన వెపన్ మిస్సింగ్ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టైంది. అయితే పోలీసులకు ఇక్కడ్నుంచే అసలు సమస్య మొదలైంది. నిందితున్ని సుమారు 20 గంటలకు పైగా విచారణ చేసినా ఫలితం లేకపోయింది. నిందితుడు చెబుతున్న సమాధానాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారే తప్ప అసలు విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు.
దీంతో కేసు రీ కన్‌స్ట్రక్షన్ చేసి అయినా దీనిపై ఒక నిర్దారణకు వద్దామని భావించి సదానందంను అక్కన్నపేటకు తీసుకెల్లి ఆరా తీశారు. అది కూడా ఫలితాన్నివ్వలేదు. దీంతో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో సదానందాన్ని ప్రశ్నలతో ముంచెత్తినా… మూడేళ్ల క్రితం నాటి సంఘటన గుర్తుకు రావడం లేదని, ఆయుధాల గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నానని అంటున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో కంపౌండ్ వాల్ విషయంలో జరిగిన గొడవలో తన ప్రత్యర్థి వాడిన బూతు పదాల వింటే మీరు మాత్రం కాల్చకుంటా ఉంటారా సార్ అంటూ తనగోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో నిందితున్ని కోర్టులో హాజరు పరిచి కస్టడీ పిటిషన్ వేసి మళ్లీ విచారించాలని నిర్ణయించారు. సోమవారం హుస్నాబాద్ కోర్టులో సదానందంను విచారించేందుకు మరోసారి కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అయితే ఆయుధాల మిస్సింగ్ కేసు విచారణలో పోలీసు అధికారుల డొల్లతనం బయటపడింది. నేరం జరిగితే ఆధారం కోసం అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని వెలికి తీసే పోలీసులు… తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వెపన్స్ మాయం అయితే కేసు పెట్టి ఇద్దరు గన్‌మెన్లను వీఆర్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు. అలాగే అప్పుడు సీఐగా పని చేసిన దాసరి భూమయ్యకు ఛార్జ్ మెమో ఇచ్చారు. ఆ తరువాత లోతైన విచారణ మాత్రం చేయలేకపోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారణంగానే మూడేళ్లుగా ఆయుధాల మిస్సింగ్ కేస్ పోలీసు రికార్డుల్లో మిస్సింగ్‌గానే మిగిలిపోయింది. అయితే అనూహ్యంగా సదానందం కాల్పులకు పాల్పడడంతో పోలీసు విభాగానికి చెందిన ఆయుధాల ఆచూకీ లభ్యమయిందే తప్ప పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం కాదన్నది వాస్తవం.
ఇదే సమయంలో పోలీసు అధికారులు నమోదు చేసిన కేసులో గన్‌మెన్ నరేందర్ నిందితుడిగా ఉన్నారు. ఇక్కడే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు ఆయుధాలు మాయమైతే ఒక్కరిపైనే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఒక్క గన్‌మెన్ రెండు ఆయధాలను వినియోగించడు కదా?.. ఒక్కో గన్‌మన్‌కి ఒక్కో వెపనే కదా ఇస్తారు. అలాంటప్పుడు ఇద్దరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది కదా? అలా కాకుండా ఒక్కరిపైనే ఎందుకు కేసు నమోదు చేశారు. అంటే చేయని తప్పుకి ఒకర్ని బలిచేద్దామనుకున్నారా? లేదా ఇంకొకర్ని రక్షించాలనుకున్నారా? విచారణకు కూడా కేవలం నరేందర్‌ను మాత్రమే ఎందుకు పిలిచారు?.. నరేందర్ ఆయుధాన్ని పోలీస్ స్టేషన్‌లోని ‘బెల్ ఆఫ్ ఆర్మ్స్’లోనే ఉంచానని చెప్తున్నట్టుగా సమాచారం. అంటే ఆయన ఆయుధం అప్పగించాడన్నదానికి ఆధారం ఉందా? లేదా? దానిని తేల్చాల్సింది అప్పటి స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ.. ఆయన కంట్రోల్లోనే ఠాణా ఆయుధాగారం ఉండాల్సి ఉంటుంది. పెయింట్స్ వేయడం కారణంగా అప్పటి ఎస్‌హెచ్‌ఓ వేరెవరికైనా బాధ్యతలు అప్పగించారా?.
ఈ కోణాన్ని పోలీసు అధికారులు ఎందుకు విస్మరిస్తున్నారు?. నరేందర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా 2016, 17 సంవత్సరాల్లో విధుల్లో ఉన్న వారిని కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరి ఉన్నతాధికారులు ఎందుకలా చేయడం లేదు?. పోలీస్ స్టేషన్ జనరల్ డైరీతో పాటు వెపన్స్ ఇంఛార్జీ మెయింటెయిన్ చెసే రికార్డును కూడా ఒకసారి పరిశీలిస్తే ఫలితం ఉంటుంది కదా?. అలా ఎందుకు చేయడం లేదు?. సాధారణ కేసుల్లో ఆధునిక సాంకేతికత సాయంతో గంటల్లోనే కేసులు పరిష్కరిస్తు్న్న పోలీసులకు ఈ కేసు ఎందుకు సవాలుగా మారుతోంది?.. ఈ ఘటనలో మొబైల్ కాల్స్ లిస్ట్ డాటా సేకరించాలనుకున్నా మూడేళ్ల క్రితం సంఘటన కావడంతో అప్పటి కాల్స్ జాబితా లభ్యం అయ్యే అవకాశాలు లేవు.
ఎందుకంటే మొబైల్ కాల్ డేటాను ఆ సంస్థలు ఏడాది పాటు మాత్రమే బ్యాకప్ చేసి ఉంచుతాయి. సదానందం స్టేషన్ నుండి ఆయుధాలు ఎవరికీ కనిపించకుండా ఎత్తుకెళ్లే అవకాశాలైతే దాదాపు లేనట్టే.. ఎందుకంటే షార్ట్ వెపన్స్ అయితే ప్యాంటులో దాచి తీసుకెళ్లొచ్చు.. ఇవి పెద్ద ఆయుధాలు కనుక వీటిని బ్యాగులో తీసుకెళ్లాలి. తన భార్యతో వివాదం సందర్భంగా పోలీసులతో సదానందం సన్నిహితంగా మెలిగాడంటున్న నేపథ్యంలో స్టేషన్ రికార్డులను పరిశీలిస్తే అతనిపై కేసు ఎప్పుడు నమోదైందో తెలిసిపోతుంది. అప్పటి స్టేషన్ సిబ్బందినందర్నీ విచారిస్తేనయినా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ కేసు నమోదు చేయకుంండా కేవలం కౌన్సెలింగ్ కు పిలిపించినా కూడా పోలీసులు ఈ విషయాన్నీ రికార్డ్ చేసే అవకాశం ఉన్నందున ఆ వివరాల ఆధారంగా విచారణ చేపడితే కేసు కొలిక్కి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… ఇంతకీ పోలీసులు వింటారా?