జాయింట్ కలెక్టర్‌ని అని చెప్పి.. డ్రైవర్‌, పీఏను పెట్టుకున్నాడు.. చివరకు

by Sridhar Babu |
జాయింట్ కలెక్టర్‌ని అని చెప్పి.. డ్రైవర్‌, పీఏను పెట్టుకున్నాడు.. చివరకు
X

దిశ, మంచిర్యాల: ఐఏఎస్ అధికారిని అంటూ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ డి.ఉదయ్ కుమార్ వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 2020లో ఐఏఎస్‌కు ఎంపికయ్యానని, మంచిర్యాల జాయింట్ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చిందని జిల్లా కేంద్రంలోని స్థానిక గౌతమి నగర్‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. నెలకు రూ.25 వేల వేతనంతో రమేష్ అనే డ్రైవర్‌ను కూడా నియమించుకొని, అతన్ని పర్మినెంట్ చేస్తున్నట్లు చెప్పి, రూ.45 వేలు వేతనం ఇవ్వడం మొదలుపెట్టాడు. దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన మహేందర్‌ను పీఏగా నియమించుకున్నారు. అంతేగాకుండా.. కారుకు కలెక్టర్ నేమ్ ప్లేట్, పోలీస్ సైరన్ సైతం అమర్చుకున్నాడు.

దీంతో రమేష్, మహేందర్‌లు పూర్తిగా నమ్మినట్లు గ్రహించిన నిందితుడు 20 నుంచి 30 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో వారి బంధుమిత్రులు 29 మంది వద్ద రూ.80 లక్షలు వసూలు చేసి, రెండు కార్లు, ఒక బుల్లెట్ బైక్, జగిత్యాలలో ఒక ఇల్లు, ఒక ప్లాట్ కొని, మిగతా డబ్బు విలాసాలకు ఖర్చు చేశాడు. అనంతరం మెల్లగా విషయం గ్రహించిన బాధితులు తాళ్లపల్లి రమేష్, శ్వేతలు ఉద్యోగాలు పెట్టిస్తానని తమను మోసం చేశాడని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ గుట్టు రట్టయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి, రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకొని, ప్రాపర్టీని సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed