భూమి కోసం తమ్ముడి హత్య

by Shyam |
భూమి కోసం తమ్ముడి హత్య
X

దిశ, పటాన్‌చెరు:
30 గజాల స్థలం కోసం రక్త సంబంధాన్ని కాదనుకుని తోడబుట్టిన తమ్మున్నే హత మార్చిన అన్నను , అతనితో పాటు ఓ ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పటాన్‌చెరు ఇంచార్జీ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామానికి చెందిన గండిగూడెం వెంకటేశ్(40) జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం లోని బీసీ కాలనీలో నివాసం ఉంటన్నాడు. ఆటో డ్రైవర్‌గా ఆయన జీవనం కొనసాగిస్తున్నాడు. వెంకటేశ్‌కు మొత్తం నలుగురు అన్నదమ్ములు , ఇద్దరు అక్కా చెల్లెల్లు ఉన్నారు.

తండ్రి శివయ్య ద్వారా వారికి మల్లంపేట గ్రామంలో 450 గజాల స్థలం సంక్రమించింది. కాగా దాన్ని ఒక్కొక్కరికి 90 గజాలు వచ్చేలా పంచుకున్నారు. అయితే వెంకటేశ్ అన్న గండిగూడెం యాదగిరి తన స్థలంలో ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నాడు. కాగా ఇటీవల ఇల్లు నిర్మిస్తాననీ వెంకటేశ్ తన స్థలాన్ని కొలిస్తే 60 గజాల మాత్రమే మిగిలింది. తన 30 గజాల స్థలాన్ని తన అన్న యాదగిరి ఆక్రమించుకున్నాడని తేలింది. ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. దాంతో వెంకటేశ్ పై అన్న యాదగిరి కోపం పెంచుకున్నాడు. దీంతో వెంకటేశ్‌ను హత్య చేయించడానికి మోతే రాజేష్, తూర్పాటి జగదీష్, దుండిగల్ సాయికిరణ్, షేక్ ఫరీద్, కే.నవీన్ లతో యాదగిరి లక్ష రూపాయల సుపారీ కుదుర్చుకున్నాడు. కాగా ఈనెల 10 ఉదయం పలుగు పోచమ్మ గుడికి వెళ్లడానికి వెంకటేశ్ ఆటోను ఈ ఐదుగురు కలిసి బుక్ చేసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఆటోను పిలిపించుకున్నారు. దైవ దర్శనం తరువాత తిరిగివస్తూ, జిన్నారం మండలం కిష్టయపల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో అందరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్‌ను ఐదుగురు కలిసి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటో పక్కన వదిలేసి, మృతుడి సెల్ ఫోన్ ను అన్న యాదగిరికి ఇచ్చారు. కాగా ఈ నెల 11న జిన్నారం పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదు అయింది. సుపారీ గ్యాంగ్ కు ఇవ్వాల్సిన మిగితా 50 వేలు బుధవారం ఉదయం ఇస్తుండగా పటాన్‌చెరు, బొల్లారం పోలీసుల బృందం ఎంతో చాకచక్యంగా ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 వేల రూపాయలు, ఒక ఆయుధం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed