‘ఆదర్శ పథంలో పోలీసు – సమగ్ర పరిశీలన’ పుస్తకావిష్కరణ

by Shyam |   ( Updated:2021-06-15 09:15:34.0  )
dgp-office -1
X

దిశ, హైదరాబాద్ : ప్రజా భద్రత కోసం ఏర్పాటైన పోలీసు వ్యవస్థ ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతీ పోలీసు అధికారిపై ఉందని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ పోలీసు అధికారి పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి రచించిన ‘‘ఆదర్శ పథంలో పోలీసు- సమగ్ర పరిశీలన’’ అనే పుస్తకావిష్కరణ డీజేపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రంథ రచయిత పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డితో పాటు అడిషనల్ డీజీలు రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఉమేష్ ష్ట్రాఫ్, సందీప్ షాండిల్య, బాలనాగదేవి, స్వాతి లక్రా, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ ప్రజలతో ఎలా మమేకం కావాలి, ఎలా పనిచేయాలి అనే అంశాలపై తిరుపతి రెడ్డి రాసిన ‘‘ఆదర్శ పథంలో పోలీసు అనే పుస్తకం’’లో సవివరంగా పేర్కొన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పురాతన పోలీసు కమిషనరేట్‌లలో ఒకటైన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కొత్వాల్‌గా రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి రాష్ట్రంలో ఆధునిక పోలీసింగ్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గురించిన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో ఉందని, ఇది పోలీసులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పోలీసు శాఖలోని హోంగార్డు అధికారి నుండి ఉన్నతాధికారి వరకు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. ప్రజా శ్రేయస్సే పరమార్థంగా పోలీసులు సేవలందించాలనే సందేశాన్ని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు ప్రశంసనీయమని అన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల లక్షా 50 వేల మంది మరణిస్తున్నారని, ఈ ప్రమాదాల కేసులను ఎలా దర్యాప్తు చేయాలి, నిందితులకు ఎలా శిక్ష పడాలి అనే అంశాలను తెలియజేస్తూ తిరుపతి రెడ్డి మరో పుస్తకం వెలువరించడం పట్ల డీజీపీ అభినందించారు.

ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అధికారిగా, రచయితగా సునిశిత పరిశీలకులుగా బహుముఖ ప్రజ్ఞశాలి తిరుపతి రెడ్డి రాసిన ఈ ఆదర్శ పథంలో పోలీసు పుస్తక అంశాలను సురక్ష పత్రికలో సీరియల్‌గా ప్రచురించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రంథ రచయిత పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థను ప్రజాహిత విభాగంగా రూపుదిద్దాలని డీజీపీ మహేందర్ రెడ్డి చేస్తున్న కృషి కనుగుణంగానే ఈ పుస్తక రచన చేపట్టానన్నారు. పౌర సమాజానికి అవసరమయ్యేలా ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రంథ రచయిత తిరుపతి రెడ్డిని పోలీసు శాఖ తరఫున డీజేపీ మహేందర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed