మూడేళ్ల తర్వాత తెరపైకి పాత కేసు

by Anukaran |
మూడేళ్ల తర్వాత తెరపైకి పాత కేసు
X

దిశ, కాటారం: కొంతమంది స్వార్థ పరుల వల్ల అమాయకులు బలైపోయారు. తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాతో దళారులు చేసిన ఈ దందా చల్లబడిందని సంబరపడ్డారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది.. మూడేళ్ల తరువాత ఆ కేసు ఫైలును పోలీసులు తిరగేసి అక్రమార్కుల చిట్టా సేకరించే పనిలో పడ్డారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని పలు గ్రామాల్లోని అమాయకులను మోసం చేసి నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసిన దాదాపు రూ. 3.5 కోట్ల రూపాయల మేర రుణాలు ఎత్తుకున్నారు.

వ్యవసాయ రుణాలు ఎత్తుకునేందుకు దళారులు అమాయకులకు మాయమాటలు చెప్పి మరీ వారి ఆధార్ కార్డ్, ఫొటోలు సేకరించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వివరాలు కావాలని పల్లె జనాన్ని నమ్మించి నకిలీ పాసు పుస్తకాలను తయారు చేశారు. ఈ ఘటన బయటకు పొక్కడంతో 2017లో కాళేశ్వరంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి సీఐడీ పోలీసులు కూడా ఆరా తీశారు. కానీ విచారణ దశలోనే నిలిచిపోయింది.

అయితే తాజాగా కాళేశ్వరం పోలీసులు ఈ కేసు పూర్వాపరాలపై ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు. బాధితులెవరు..? నిందితులు ఎవరూ అన్న కోణంలో సమగ్ర విచారణ చేస్తన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బ్యాంకు నుండి రుణాలు పొందిన వారి జాబితా సేకరించిన పోలీసులు ఎంక్వైరీ చేపడుతున్నారు.

దళారులెవరో..?

అమాయకులకు మాయ మాటలు చెప్పి బ్యాంకులో వ్యవసాయ రుణాలు మంజూరు చేయించి ఈ డబ్బులను లబ్దిదారుల అకౌంట్ల నుండి తమ అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన దళారుల గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.

నకిలీ పాస్ పుస్తకాల ముద్రణ ఎక్కడో..?

దాదాపు నాలుగు గ్రామాలకు చెందిన అమాయకుల పేరిట లోన్ స్కాంకు పాల్పడ్డ ఘనులు నకిలీ పాసు పుస్తకాలను ఎక్కడ ముద్రించారో కూడా తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నం అయినట్లు సమాచారం. అంతేకాకుండా నకిలీ పాసుపుస్తకాలను క్రియేట్ చేయడానికి ఎవరెవరు సహకరించారోనన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed