లాక్‌డౌన్.. వారి ‘లక్’‌డౌన్?

by Shyam |
లాక్‌డౌన్.. వారి ‘లక్’‌డౌన్?
X

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు వచ్చే అన్ని వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్లాలనుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చినా.. చివరకు వారికి నిరాశే మిగిలింది. గంటలు గంటలుగా పాడిగాపులు కాసి తెలంగాణ పోలీసుల నుంచి ఎట్టకేలకు ఎన్ఓసీ సాధించి.. గంపెడు ఆశతో ఏపీలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. కానీ, ఏపీ రాష్ట్ర పోలీసులు, అధికారులు లాక్‌డౌన్ నేపథ్యంలో వారిని రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్దనే నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్‌పోస్టు వద్ద పడిగాపులు కాసిన విద్యార్థులు, ఇతర ప్రయాణికులను ఎట్టకేలకు వెనక్కి పంపారు. ఆంధ్రాలోకి రావాలంటే నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు ఉండాలని అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో కొందరు విద్యార్థులు, ప్రయాణికులు వెనుదిరిగారు. విజయవాడ సబ్ కలెక్టర్ నచ్చజెప్పడంతో సుమారు 100 మంది విద్యార్థులు ఐఐఐటీలో క్వారంటైన్‌కు ఉండేందుకు అంగీకరించారు. అనంతరం కర్ఫ్యూ కారణంగా ఇకపై ఎవ్వరూ హైదరాబాద్ నుంచి రావద్దని పోలీసులు కోరుతున్నారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ పోలీసులు ఎన్‌ఓసీ ఇచ్చినప్పటికీ.. ఏపీ అధికారులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కొందరికి వాహనాలు లేకపోవడంతో చెక్ పోస్టుల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. అయితే, వీరిని కూడా రాష్ట్రంలోకి రానిచ్చేందుకు షరతులతో కూడిని అనుమతులు ఇచ్చారు. ప్రయాణికులందరినీ ప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్ ప్రోటో‌కాల్ కోసం క్వారంటైన్‌కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరు, కృష్ణాజిల్లాల వాసులను అధికారులు నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలిస్తున్నారు. ఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌, వెస్ట్‌గోదావరి వారిని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు. 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు చేశాకే స్వస్థలాలకు పంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల నిర్ణయంతో పలువురు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవ్వగా మరికొందరు క్వారంటైన్‌కు సుముఖత వ్యక్తం చేశారు. మిగతావారు మాత్రం దిక్కుతోచని స్థితిలో చెక్‌పోస్టుల వద్దనే పడిగాపులు కాస్తున్నారు.

Tags : lockdown, passengers, students, employees, quarantines, ap, telangana, border, police

Advertisement

Next Story