‘కర్ఫ్యూ’లో కనిపించని సీరియన్ నెస్.. లైట్ తీసుకున్నారా..?

by Shyam |   ( Updated:2021-04-23 11:38:46.0  )
‘కర్ఫ్యూ’లో కనిపించని సీరియన్ నెస్.. లైట్ తీసుకున్నారా..?
X

దిశ, క్రైమ్‌బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు నియంత్రణకు అమలవుతున్న కర్ఫ్యూ, కొవిడ్ రూల్స్‌పై ప్రభుత్వం, పోలీసులు సీరియస్ నెస్ కోల్పోయారా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ అమలవుతున్న నైట్ కర్ఫ్యూ తొలి రోజును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు క్రమేపి లైట్ తీసుకున్నట్లు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. రాత్రి పూట 12 గంటలు, ఆ తర్వాత కూడా యువకులు, ఇతర వాహనదారులు రోడ్లపై సంచరిస్తున్నా.. నిబంధనల ప్రకారం సంబంధిత వాహనదారులను, యువకులను ఆపి, రోడ్లపై తిరుగుతున్న కారణాలను ప్రశ్నించాల్సి ఉంది. కానీ, ఆవైపుగా చర్యలు తీసుకోవడం లేదంటూ పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.

అరకొరగానే చెక్ పోస్టులు..

హైదరాబాద్ నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 నుంచి 3 లక్షల జనాభా ఉన్నారు. కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో లక్ష జనాభా ఉన్నవి కూడా ఉన్నాయి. మరికొన్నింటిలో 4 లక్షల జనాభా ఉన్న పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. రెండు లక్షల జనాభా ఉన్న పోలీస్ స్టేషన్లకు 2 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రకారం దాదాపు 10 లక్షల జనాభా కలిగిన ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో సుమారు 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, ఈ పీఎస్ పరిధిలో కేవలం మూడు చెక్ పోస్టులు మాత్రమే ఏర్పాటు చేయడం గమనార్హం. నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ ప్రకటించకపోవడం విశేషం. దీంతో ఈ నెల 30 వరకూ కొనసాగనున్న రాత్రిపూట కర్ఫ్యూ పట్ల ప్రభుత్వానికి, పోలీసులకు ఎంతటి చిత్తశుద్ది ఉందో స్పష్టమవుతోంది.

తాపీగా కూర్చుంటున్నారు..

నగరంలో అరకొరగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ, ఒక్కో చెక్ పోస్టు వద్ద 8 నుంచి 10 మంది వరకూ సిబ్బంది ఉంటున్నారు. కర్ఫ్యూ ప్రారంభం రోజు నుంచి పోలీసులు సీరియస్‌గా వ్యవహారించినట్టు కనిపించినా.. ఆ మరుసటి రోజు నుంచి వారు కర్ఫ్యూను పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదన్నట్లు కన్పిస్తోంది. దీంతో వాహనదారులు, ఇతర యువకులు అవసరం లేకున్నా.. రోడ్లపైకి వస్తున్నారు. ఒకవేళ నిత్యావసరం ఉన్నవారికి మినహాయింపులు ఉన్నప్పటికీ, రోడ్లపైకి వచ్చే వారిని కనీసం ఆపి, ప్రశ్నించడం లేదు. ఈ సమయంలో పోలీసులు వారి ఏర్పాటు చేసుకున్న టెంట్లు, కూర్చీల వద్ద తాపీగా కూర్చోవడం, సెల్ ఫోన్లలో నిమగ్నం అవుతున్నట్టు సిటీజన్లు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా, వీరి కూర్చునే వద్ద కనీసం భౌతిక దూరం పాటిస్తూ అయినా.. కూర్చోకపోవడాన్ని కూడా రాత్రి పూట పోలీసులను గమనిస్తున్న పౌరులు చెప్పుకుంటున్నారు.

సిబ్బందిలో పాజిటివ్ కేసులు..

గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో 120 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో12 వేలు, సైబరాబాద్‌లో 7 వేలు, రాచకొండలో 6వేల సిబ్బంది ఉన్నారు. మొత్తంగా మూడు కమిషనరేట్‌లలో 25 వేల సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 30 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉండగా, అత్యధికంగా హైదరాబాద్ నగరంలోనే సిబ్బంది కొరత ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53 వేల పోలీసులను కూడా కరోనా వెంటాడుతోంది. వీటిలో గతేడాది దాదాపు 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా పోలీసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. నిరంతరం ప్రజలతో సత్సంబంధాల ద్వారానే విధులు చేపట్టాల్సి రావడంతో పోలీసుల్లోనూ కరోనా భయం నెలకుంటుంది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగర కమిషనరేట్‌లోనే 700 మందికి, రాచకొండ‌లో 225 మందికి, సైబరాబాద్‌లోనూ పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వీరంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దీంతో అసలే సరిపడా సిబ్బంది లేక పోలీసు శాఖ అవస్థలు పడుతుండగా.. కరోనా కారణంగా కూడా విధులు చేపట్టే సిబ్బంది తగ్గిపోతున్నారు. సిబ్బంది కొరత సంగతి ఎలా ఉన్నా.. ఉన్న సిబ్బంది అయినా కర్ఫ్యూ అమలును చిత్తశుద్దిగా అమలు చేయాలని, కరోనా నియంత్రణలో భాగంగా రోడ్లపైకి అనవసరంగా వచ్చే వారిని నిలువరించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story