కరోనాపై విజయం తథ్యం

by Shyam |
కరోనాపై విజయం తథ్యం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ‘‘కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నది. మరణాల రేటు కూడా తక్కువే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి పోరుతో కరోనాపై విజయం సాధిస్తామనే విశ్వాసం ఉంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నాం. తొందర్లోనే అదుపులోకి వస్తుంది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతుంది. కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాలు దాటుతున్నారు. వారికి అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే. ఎక్కడి వారు ఎక్కడైనా పనిచేసుకునే అవకాశం ఉండాలి. బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారు’’ అని సిఎం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్సు అనంతరం చర్చకు వచ్చిన కొన్ని అంశాలను ప్రకటన ద్వారా తెలియజేశారు.

మళ్ళీ లాక్‌డౌన్ లేదు : పీఎం

దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “లాక్‌డౌన్‌ల దశ ముగిసింది. అన్‌లాక్‌ల దశ ప్రారంభమయింది” అని బదులిచ్చారని సీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారేమోననే ప్రచారం జరుగుతున్నదని కేసీఆర్ ప్రస్తావించగా “దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్‌డౌన్ ముగిసింది. అన్‌లాక్ 1.0 నడుస్తున్నది. అన్‌లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి” అని ప్రధాన మంత్రి స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.

Advertisement

Next Story