ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఖర్చు కేంద్రానిదే

by Shamantha N |
ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఖర్చు కేంద్రానిదే
X

న్యూఢిల్లీ: వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సుమారు ఒక కోటి మంది వైద్య సిబ్బంది, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్ల(పారిశుధ్యకార్మికులు, పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, డిఫెన్స్ బలగాలు, హోంగార్డులు, సర్వెలెన్స్‌కు సంబంధించి సేవలందించిన రెవెన్యూ అధికారులు)కు టీకా వేయనున్నారు. రెండో దశలో 50ఏండ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుతో బాధపడుతున్నవారికి టీకా వేస్తామని ప్రధాని తెలిపారు. ఇందులో చట్టసభ్యులు(ఎంపీలు, ఎమ్మెల్యేలు) ఉండబోరని స్పష్టం చేశారు. కేవలం నెలల వ్యవధిలోనే 30 కోట్ల మందికి టీకా వేస్తున్నామని అన్నారు.

టీకా పంపిణీపై వదంతులు వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16న టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో మాట్లాడుతూ… దేశీయంగా తయారైన కరోనాటీకాలపై ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో తయారైన వ్యాక్సిన్‌ల కంటే మేడిన్ ఇండియా టీకాలు చౌకగా అభివృద్ధి చేశారని, దేశీయ అవసరాలకు అనుగుణంగానే తయారు చేశారని వివరించారు.

ఇప్పటి వరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లకు అత్యవసర వినియోగ అనుమతులు లభించాయని, మరో నాలుగు టీకాలు అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం మౌలిక వసతులు, ఇతర సదుపాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పటిష్టంగా ఉన్నదని వివరించారు. దేశవ్యాప్తంగా డ్రై రన్ విజయవంతంగా సాగిందని అన్నారు. పోలింగ్ ప్రక్రియలో చేపట్టే బూత్‌స్థాయి వ్యూహాన్నే టీకా పంపిణీకి పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed