కాటారం రేషన్ షాపులో ప్లాస్టిక్ బియ్యం.. తీవ్ర ఆగ్రహంలో ప్రజలు

by Anukaran |
కాటారం రేషన్ షాపులో ప్లాస్టిక్ బియ్యం.. తీవ్ర ఆగ్రహంలో ప్రజలు
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఒదిపిలవంచ గ్రామంలో పౌరసరఫరాల శాఖ రేషన్ షాప్ దుకాణం ద్వారా ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ జరిగినట్టు లబ్ధిదారులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. ఒడికి లావణ్య గ్రామంలోని రేషన్ షాప్ ద్వారా డిసెంబర్ నెల కోటా బియ్యం పంపిణీ ప్రారంభించారు. గ్రామానికి చెందిన పల్లె రామయ్య రేషన్ కార్డు ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్య కనుగుణంగా 35 కిలోల బియ్యం తీసుకున్నారు. రేషన్ షాప్ ద్వారా తీసుకున్న బియ్యంతో ఆదివారం వంట చేసుకున్నారు. బియ్యంలో పైన అంతా బంక బంకగా ప్లాస్టిక్ మయంగా తేలినట్టు మహిళలు గుర్తించారు.

దానిని చూడగానే వేరు చేసి నీటిలో వెయ్యక బియ్యపు గింజలతో ఉడికిన అన్నం అడుగు భాగాన చేరుకోగా ప్లాస్టిక్ మాదిరిగా ఉన్న బియ్యం నీటిపై తేలిన జిగురు జిగురుగా ఉండడంతో ప్లాస్టిక్ బియ్యం వచ్చినట్లు పల్లె రామయ్య కుటుంబ సభ్యులు గ్రామ సర్పంచ్ కోడి రవి కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్ ఈ విషయాన్ని గుర్తించి రేషన్ షాప్ ద్వారా సరఫరా అయిన బియ్యం మొత్తము పక్కన ఉంచాలని తెలిపారు. గతంలో సైతం పలుమార్లు ఇలాంటి బియ్యం గ్రామంలో పంపిణీ జరిగినట్టు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైస్ మిల్లర్ల ద్వారా పంపిణీ చేసిన ఈ బియ్యం రేషన్ షాపులకు చేరుకుని ప్రజలకు పంపిణీ అవుతోంది. అయితే, మహదేవ్పూర్ సివిల్ సప్లయ్ గోడౌన్ ద్వారా రేషన్ షాపులకు బియ్యం చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.

ప్లాస్టిక్ బియ్యంపై విచారణ జరపాలి :

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రేషన్ దుకాణాల్లో సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతగా ఉండటం లేదు. అవి తిన్న ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గ్రామంలో డిసెంబర్ నెల పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంపై గ్రామ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తతంగం పై పూర్తి విచారణ జరిపించి ప్లాస్టిక్ బియ్యం రేషన్ షాపునకు సరఫరా చేసిన రైస్ మిల్లర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిఘాను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు.

-కోడి రవికుమార్, సర్పంచ్ ఒడిపిలవంచ

Advertisement

Next Story