పింక్ బాల్ టెస్ట్‌పై ఆధిపత్యం ఎవరిదో?

by Shiva |
పింక్ బాల్ టెస్ట్‌పై ఆధిపత్యం ఎవరిదో?
X

దిశ, స్పోర్ట్స్: ‘టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 15 పింక్ బాల్ (డే/నైట్) టెస్టులు నిర్వహించగా.. కేవలం రెండు సార్లు మాత్రమే పర్యాటక జట్టు గెలుపొందింది. మిగిలిన 13 మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టుదే పై చేయిగా నిలిచింది.’

‘టీమ్ ఇండియా స్వదేశంలో ఆడిన ఏకైక పింక్ బాల్ టెస్ట్‌ను గెలుచుకుంది. ఈడెన్ గార్డెన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్టును భారత జట్టు గెలుచుకుంది’

‘ఇంగ్లాండ్ జట్టు విదేశాల్లో ఆడిన రెండు పింక్ బాల్ టెస్టులను ఓడిపోయింది. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ పింక్ బాల్ టెస్టులను గెలవలేకపోయింది’

పైనున్న స్టేట్మెంట్లన్నీ చూశాక.. రేపటి నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టులో టీమ్ ఇండియానే గెలుస్తుందని అనిపిస్తుంది. పింక్ బాల్ టెస్టు రికార్డులు చూస్తే ఆతిథ్య జట్టుగా టీమ్ ఇండియాకే మొగ్గు కనిపిస్తుంది. కానీ నిజంగా ఇంగ్లాండ్ జట్టుపై టీమ్ ఇండియా ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? పింక్ బాల్ టెస్టు ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు టీమ్ ఇండియాలో తక్కువే. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా సత్తా చాటుతుందా? పునఃనిర్మాణం తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మొతేరా స్టేడియం పేసర్లకు అనుకూలిస్తుందా? స్పిన్నర్లకా వంటి అనేక ప్రశ్నల నడుమ మూడో టెస్టు ఆడటానికి ఇండియా-ఇంగ్లాండ్ జట్లు బరిలోకి దిగనున్నాయి.

పేసర్లదే హవా..

డే/నైట్ టెస్టుల్లో ఉపయోగించే పింక్ బంతులు ఎక్కువగా స్వింగ్ అవుతుంటాయి. వీటి సీమ్ త్వరగా తగ్గిపోదు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ పేసర్లు స్వింగ్‌ను రాబడుతుంటారు. ఇప్పటి వరకు 15 డే/నైట్ టెస్టు మ్యాచ్‌లు జరుగగా.. అందులో 354 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. ఇక స్పిన్నర్లకు లభించినవి 115 వికెట్లు మాత్రమే. ఈ గణాంకాలు చాలు పింక్ బంతి పేసర్లకు ఎంతలా సహకరిస్తుందో చెప్పడానికి. టీమ్ ఇండియాలో జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్‌లోని జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్లకు పింక్ బంతి తప్పకుండా సహకరిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి రెండు టెస్టుల్లో టాస్ ఎలా కీలకంగా మారిందో.. మూడో టెస్టులో కూడా టాస్ మరింత కీలకంగా మారబోతున్నది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుండటంతో ఆ సమయంలో మంచు ప్రభావం ఉండదు. కానీ రాత్రి సమయంలో తప్పకుండా బంతిపై మంచు ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎస్జీ బంతులపై పూత ఎక్కువగా ఉండటం వల్ల స్పిన్నర్లు, స్లోబౌలర్లకు మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కదు. కాబట్టి ఆ సమయంలో పేసర్లతోనే బౌలింగ్ చేయించాలి. పిచ్‌పై ఉన్న గడ్డిని ఎక్కువగా తొలగించినా.. మంచు ప్రభావం తప్పక ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సాయంకాలం పూట బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమైన విషయం. కాబట్టి టాస్ గెల్చిన జట్టు బౌలింగ్ చేయడానికే మొగ్గుచూపుతుంది.

అది స్లో పిచ్.. అయినా అనుమానమే

టీమ్ ఇండియా తొలి టెస్టు ఓడిపోయిన తర్వాత పిచ్ తయారీపై మరింత శ్రద్దపెట్టింది. తమకు అనుకూలంగా ఉండే స్లోపిచ్‌ను రెండో టెస్టుకోసం సిద్దం చేసింది. టాస్ కూడా కలసిరావడంతో రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. మూడో టెస్టుకు కూడా అలాంటి పిచ్‌నే క్యూరేటర్ సిద్దం చేశాడు. ఈ పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండేలా మార్పులు చేసినట్లు సమాచారం. అయితే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా.. ఎస్జీ పింక్ బంతులు అందుకు అనుకూలంగా లేకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్య. దీనిపై ఉండే అదనపు పూతే స్పిన్నర్లకు పెద్ద శాపంలా మారుతున్నది. ఈ బంతులతో పేస్ బౌలర్లు మంచి స్వింగ్ రాబట్టగలిగినా.. స్పిన్నర్లు మాత్రం కాస్త కష్టపడాల్సిందే. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించిన అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో స్పిన్ పిచ్ ఎవరికి అనుకూలంగా మారుతుందో చెప్పలేము. ఇంగ్లాండ్ జట్టులోని జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జోఫ్రా ఆర్చర్ బంతిని మంచి స్వింగ్ చేయగలరు. టీమ్ ఇండియాలోని ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ చక్కని వేగంతో బంతులు వేయగలరు కానీ స్వింగ్‌ను ఏ మాత్రం రాబట్టగలరు అనే దానిపై అనుమానాలు ఉన్నాయి.

బ్యాటింగ్..

టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉన్నది. ఇండియాలో జట్టులో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రెండో టెస్టులో అజింక్య రహానే, చతేశ్వర్ పుజార తమ ఫామ్ అందుకున్నారు. ఇక చివర్లో రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్య భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ బ్యాటింగ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. రోరీ బర్న్స్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, సిబ్లీ భారత పిచ్‌లపై చక్కగా రాణిస్తున్నారు. ఇక జానీ బెయిర్‌స్టో జట్టులో చేరడం అదనపు బలాన్ని చేకూర్చింది. టాస్ కీలకంగా మారనున్న నేపథ్యంలో ఇరు జట్లలో టాప్ ఆర్డర్ నిలకడే మ్యాచ్‌ గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉన్నది.

జట్లు అంచనా

ఇండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ

ఇంగ్లాండ్ : డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), ఓల్లీ పోప్, బెన్ ఫోక్స్, బెన్ స్టోక్స్ (వైస్ కెప్టెన్), క్రిస్ వోక్స్, జాక్ లీచ్, జోఫ్రా ఆర్చర్, జేమ్స్ అండర్సన్

Advertisement

Next Story