ఆ ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్

by Shyam |
ఆ ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్
X

దిశ, న్యూస్ బ్యూరో: శ్రీశైలంలోని కృష్ణా జలాలను వాడుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమైనదని, నిబంధనలకు విరుద్ధమైనదని పేర్కొంటూ నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఎలాంటి ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ ప్రభావ అధ్యయనం కూడా జరగలేదని, చట్టానికి విరుద్ధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వెంటనే ఆపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. రెండు మూడు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు రానుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే ముందుగా గోదావరి లేదా కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత కేంద్ర జల సంఘం నుంచి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. పైగా పర్యావరణ చట్టం 2006 ప్రకారం ‘ఏ’ విభాగంలో ఉన్న ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావ అధ్యయనం చేసి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించాల్సి ఉన్నదని, ఈ ప్రక్రియ కూడా పూర్తికాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో గోదావరి నదిపై పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ఆ ప్రభుత్వం నిర్మించిందని, కేవలం ఏడాది లోపలే పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చారని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులకు కూడా సంబంధిత మంత్రిత్వశాఖల నుంచి అనుమతి తీసుకోలేదని గుర్తుచేశారు.

ఇప్పుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఇదే తరహాలో పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొచ్చినట్లయితే రోజుకు ఎనిమిది టీఎంసీల చొప్పున సుమారు నలభై రోజుల పాటు కృష్ణా జలాలను ఆ రాష్ట్రం వాడుకుంటుందని, ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అవసరాలకు చుక్క నీరు కూడా మిగలదని పేర్కొన్నారు. సుమారు 200 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకోడానికి ఈ ప్రాజెక్టు ఆస్కారం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని గుర్తుచేశారు. కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతంలో మాత్రమే వినియోగించుకోవాలని అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలో స్పష్టత ఉన్నప్పటికీ బేసిన్‌కు వెలుపల ఉన్న ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం నీటిని తరలించాలనుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84ను ఉల్లంఘించడంతో పాటు పర్యావరణ చట్టాన్ని కూడా ఉల్లంఘించిందని, వెంటనే ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభం కాకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు కారణంగా శ్రీశైలం దిగువ ప్రాంతంలో కృష్ణా జలాల్లోని జీవరాశులకు ముప్పు ఉంటుందని, ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ సంపదకు విఘాతం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సైతం ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదికను పరిశీలించి నిర్దిష్ట కమిటీ సిఫారసులను పొందాల్సి ఉంటుందని, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని, ఇవేమీ జరగకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వివరించారు.

Advertisement

Next Story