లోన్ తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్.. అలా చేస్తే EMI భారీగా పెరగడం ఖాయం

by Anukaran |   ( Updated:2021-11-13 08:27:40.0  )
Personal Loan EMIs
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ అవసరాల కోసం చాలా మంది బ్యాంక్ నుండి లోన్ తీసుకొని వారి ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. అయితే.. ముఖ్యంగా హోమ్ లోన్, వెహికల్ లోన్ కస్టమర్లకు షాకింగ్ వార్త వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. కొవిడ్ 19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్నది. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది రెండో అర్ధభాగం నుంచి వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక.. హోమ్ లోన్, వెహికల్ లోన్ రుణాలు చాలా వరకు రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. ఒకవేళ ఆర్‌బీఐ.. రెపో రేటును పెంచితే బ్యాంకులు కూడా ఈ పెరుగుదల భారాన్ని హోమ్ లోన్, వెహికల్ లోన్ కస్టమర్లపై వేసే అవకాశముంది. కొవిడ్-19 సమయంలో ఆర్‌బీఐ రెపో రేటును 110 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా ఉండగా.. ఇది చాలా వరకు తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే.. రెపో రేటు తగ్గింపుతో హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా 6.5 శాతానికి దిగొచ్చింది. కానీ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ఆర్‌బీఐ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందువల్ల రెపో రేటు ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. దీంతో రుణాల వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చు. వచ్చే ఏడాది హోమ్ లోన్ వడ్డీ రేట్లు 125 బేసిస్ పాయింట్ల మేర పెరిగితే.. వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి 8 శాతానికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో రుణ గ్రహీతలపై EMI భారం కూడా పెరుగుతుంది.

ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారు EMI రూపంలో రూ.38,018 చెల్లిస్తూ ఉంటే.. వడ్డీ రేట్ల పెంపు వల్ల EMI రూ.41,822 స్థాయికి చేరుతుంది. అంటే రూ.3,800 వరకు అదనంగా రుణ గ్రహీతలపై భారం పడనుంది. ఈ క్రమంలోనే ప్రతీ సంవత్సరం రూ. 45,648 అదనంగా భారంపడే అవకాశం ఉంది.

READ: తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్.. నెలకి రూ.5 లక్షలకి ఎంత EMI? వివరాలివే…

Advertisement

Next Story

Most Viewed