‘డబుల్ బెడ్రూం’ కోసం పురుగుల మందు తాగిన వ్యక్తి.. అసలేమైదంటే..?

by Sumithra |
‘డబుల్ బెడ్రూం’ కోసం పురుగుల మందు తాగిన వ్యక్తి.. అసలేమైదంటే..?
X

దిశ, నేలకొండపల్లి : డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం రాజేశ్వరపురం గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల కోసం 19 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు నేలకొండపల్లి ఎమ్మార్వో సుమ సమక్షంలో ఈరోజు లాటరీ తీశారు. డబుల్ ఇళ్ల కోసం 154 మంది అర్జీలు పెట్టుకోగా 36 మందిని అర్హులుగా నిర్ధారించి 19 ఇళ్లకు డ్రా నిర్వహించారు. దీంతో గ్రామానికి చెందిన మునిగంటి వీరబాబు అనే వ్యక్తి తనకు ఇల్లు రాలేదని మనస్తాపం చెంది తహశీల్దార్ కాళ్ళ మీద పడి తనకు ఇల్లు ఇప్పించాలని ప్రాధేయపడ్డారు. అనంతరం తాను ఇంటున్న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. గుర్తించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీరబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నట్టు తెలిసింది.

టీఆర్ఎస్ వైఫల్యం వల్లేనే ఇలాంటి ఘటనలు : యూత్ కాంగ్రెస్ నాయకులు

టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడంలో వైఫల్యం చెందిందని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళం కన్వీనర్ బచ్చల కూరి నాగరాజు అన్నారు. ఇల్లు రాలేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగిన విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు వీరబాబును ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఎద్దేవా చేశారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అర్హత ఉన్న ప్రతీ ఒక నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల పేదల కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ, నేలకొండపల్లి మండలం నల్లగొండ బద్రి తదితరులు పాల్గొన్నారు. కాగా, నేలకొండపల్లి తహశీల్దార్ సుమను ఈ ఘటనపై ‘దిశ’ వివరణ కోరగా లబ్ధిదారుల ఎంపిక, లాటరీని పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.

Advertisement

Next Story