కోతులు దాడి చేస్తాయనే భయంతో వ్యక్తి మృతి..

by srinivas |
కోతులు దాడి చేస్తాయనే భయంతో వ్యక్తి మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్ : కోతులు ఎక్కడ తనపై దాడి చేస్తాయోననే భయంతో బిల్డింగ్ మీద నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కాశీం అనే వ్యక్తి మేషన్ వర్క్ చేస్తున్నాడు. అయితే, అక్కడ కోతుల సంచారం ఇటీవల ఎక్కువైంది. అతను పనిచేస్తున్న బిల్డింగులో కోతుల గుంపు ఒక్కసారిగా రావడంతో తనపై దాడి చేస్తాయని కాశీం భయపడ్డాడు.

వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలుజారి నాలుగంతస్థుల బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, మార్కాపురంలో కోతుల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు గత కొంతకాలంగా అధికారులను కోరుతున్నారు.

Advertisement

Next Story