వసూల్ రాజా.. సంతానం లేని వారే అతని టార్గెట్

by Sridhar Babu |   ( Updated:2021-06-28 04:07:28.0  )
child-selling
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : సంతానం లేక అల్లాడి పోతున్న వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న ఓ ఘనుడు నిలువు దోపిడీ చేశాడు. రూ.లక్షల్లో డబ్బు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పసి కందులను విక్రయిస్తామంటూ మాయమాటలు చెప్పిన అతను ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షలకు పైగానే వసూలు చేసి అదృశ్యం అయ్యాడు. ఇప్పటికే ముగ్గురు బాధితులు జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేట ప్రారంభించారు. జగిత్యాల టౌన్ సీఐ జయేష్ రెడ్డి నిందితున్ని గాలించే పనిలో నిమగ్నం అయ్యారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆ వ్యక్తి జగిత్యాల జిల్లాలో తిరుగుతూ పసికందులను విక్రయిస్తానంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో గుట్టు రట్టు కావడంతో జగిత్యాల ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఇంకా ఎంత మందో..?

నిందితుని వల్ల మోసపోయిన బాధితులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇంకా ఎంతమంది ఇలాంటి బాధితులు ఉన్నారో కూడా తెలియాల్సి ఉంది. కేవలం జగిత్యాల ప్రాంతంలోనే పసికందులను విక్రయిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడా? లేక ఇతర ప్రాంతాల్లోనూ వసూలు చేశాడా అన్నది కూడా తేలాల్సి ఉంది.

ముఠానా… ఒక్కడేనా?

పసికందులను విక్రయిస్తానని మోసం చేసిన వారిలో నిందితుడు ఒక్కడే ఉన్నాడా? లేక మరికొంత మంది అతనితో జట్టు కట్టారా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. నిజంగానే పసికందులను విక్రయిస్తామని చెప్పారా లేక కల్లబొల్లి మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పసికందులను తీసుకొచ్చి విక్రయించే నెట్‌ వర్క్ ఉన్నట్టయితే చిన్నారులను ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడన్న విషయం కూడా స్పష్టం కావల్సిన అవసరం ఉంది.

వీరెలా నమ్మారో..?

సంబంధం లేని వ్యక్తి వచ్చి పసికందులను విక్రయిస్తామనగానే లక్షల రూపాయలు నిందితునికి అప్పగించడానికి కారణాలు ఏంటీ అన్నది అంతు చిక్కకుండా తయారైంది. జగిత్యాలలో పరిచయాలు ఉన్న వ్యక్తి ద్వారా బాధితుల టచ్‌లోకి వెళ్లి డబ్బులు వసూలు చేశాడా? లేక వేరే వారికి పసికందులను విక్రయించడంతో వీరితో పరిచయం ఏర్పడిందా అన్న అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.మంచిర్యాల ప్రాంతానికి చెందిన అనామకుడిని వీరెలా నమ్మారు. బాధితులను ఆ వ్యక్తి ఎలా బురిడీ కొట్టించాడన్నదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed