దండం పెట్టి చెబుతున్నా.. రోడ్ల మీదకు రావొద్దు

by Shyam |

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ నివారణకు ప్రజలెవరూ బయటకు రావొద్దని చేతులు జోడించి నిజామాబాద్ పోలీసులు ప్రజలను వేడుకుంటున్నారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని సూచిస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నగరాన్ని హాట్ స్పాట్‌గా గుర్తించినట్టు వివరించారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత రోడ్లు, ప్రధాన రహదారులపైకి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని నిలువరించి వారివద్ధ ఉన్న పత్రాలు, ఆ వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. అత్యవసరం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నామని, మిగతా ప్రజలను వెనక్కి పంపిస్తున్నట్టు చెప్పారు. సోమవారం చాలా మంది ప్రజలు గుంపులుగా నగరంలోకి వస్తుండటంతో ఆర్మూర్ రోడ్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ధ ఒక్కొక్కరికి దండం పెడుతూ పోలీసు అధికారులతో పాటు సిబ్బంది ప్రజలను వేడుకున్నారు. అంతేకాకుండా బయటకు వచ్చే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్‌లను వినియోగించాలని కోరారు. అదే దారిగుండా వెళ్తున్న రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ సైతం పోలీసు మైక్ ద్వారా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, మాస్కులు ధరించి ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags: corona, lockdown, don’t come on roads, nizamabad police

Advertisement

Next Story