నాకు సాయమేమొద్దు.. కానీ, వాచ్‌మెన్ పని ఇచ్చినా చేస్తా: జాతీయ క్రీడాకారుడు

by Sridhar Babu |   ( Updated:2021-12-15 23:56:41.0  )
jab-need1
X

దిశ, కాటారం: సమాచార వ్యవస్థ లేదు, జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు వస్తుందని ఊహించలేదు. ఈ ప్రాంతంలో ఆ క్రీడకు ఉన్న ప్రాధాన్యతే అతన్ని అటువైపుగా తీసుకెళ్లింది. సుశిక్షుతునిగా తీర్చిదిద్దే శిక్షకులు లేకున్నా మారుమూల ప్రాంతానికి చెందిన ఆ బిడ్డ జాతీయ స్థాయిలో తన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. పరిస్థితులు అనుకూలించక, కుటుంబ భారం తనపై పడడంతో ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయాడు. చివరకు అనారోగ్యం పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ క్రీడాకారుడు తనకు సాయం చేయాలని మాత్రం అభ్యర్థించడం లేదు. తనకు ఉద్యోగం ఇస్తే వచ్చే జీతంతో కుటుంబ పోషణ చేసుకుంటానని చెప్తున్నాడు. అత్యంత విషాదకరంగా ఉన్న ఆ క్రీడాకారుని జీవితంలోకి తొంగిచూస్తే…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో పూరి గుడిసెలో తల్లిదండ్రులు నిర్వహించే హోటళ్లోనే నివాసం ఉంటూ ఎదిగాడు బాల పెద్దిరెడ్డి. చిన్నపాటి గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్న అతను మహదేవపూర్ లోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాడు. అప్పటికే మహదేవపూర్ లో వాలీబాల్ క్రీడపై అక్కడి వారు ఎక్కువ మక్కువ చూపేవారు. పాఠశాల గ్రౌండ్ లో సీనియర్లు వాలీబాల్ ఆడుతున్న తీరును పెద్దిరెడ్డి గమనించేవాడు. దీంతో వారు పెద్దిరెడ్డిని ప్రోత్సహించారు. నెమ్మదిగా ఆటపై ఆసక్తి పెంచుకున్న పెద్దిరెడ్డి సహజంగానే పొడగిరి. వాలీబాల్ క్రీడకు తగ్గట్టుగా ఉండడంతో హైస్కూల్ పీఈటీలు అంకమ్మ, సంజీవరెడ్డిలు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపియ్యాడు. 6 అడగుల 3 అంగుళాల పొడవు ఉన్న పెద్దిరెడ్డి వాలీబాల్ లో షూటర్, సెంటర్ బ్లాకర్ గా రాణిస్తుండేవాడు. 1998లో జరిగిన ఆలిండియా రూరల్ స్పోర్ట్స్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జట్టు ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ జట్టులో సభ్యునిగా ఉన్న పెద్దిరెడ్డి కూడా బంగారు పతకాన్ని అందుకున్నాడు. కానీ, 1993లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తండ్రి వెంకట్ రెడ్డి చనిపోవడంతో హోటల్ ను తల్లి ఒక్కరే నడిపిస్తుండడం, తన వెనక ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉండడంతో కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకోకతప్పలేదు. ఇద్దరు తమ్ముళ్లను ప్రయోజకులను చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే 2011లో అతని జీవిత గమనం మరింత కష్టాల్లో పడిపోయింది. పక్షవాతానికి గురి కావడంతో పెద్దిరెడ్డి తన పని తాను చేసుకోలేకపోయాడు. దీంతో చికిత్స చేయించుకోవడంతో పాటు పిల్లలను కూడా చదివించాలన్న లక్ష్యంతో మహాదేవపూర్ నుండి హన్మకొండకు వలస వెళ్లిపోయాడు. ఓ స్కూల్ లో తన భార్యతో కలిసి క్యాంటిన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. కానీ మహమ్మారి కరోనా ప్రభావం పెద్దిరెడ్డి కుటుంబంపై తీవ్రంగా పడింది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న పెద్దిరెడ్డి కుటుంబానికి ఉపాధి లేకుండా చేసింది మాయదారి కరోనా. దీంతో అతని భార్య ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. అయితే పెద్దిరెడ్డి తన ఆరోగ్యం కూడా కొంతమేర బాగయినందున తాను కూడా ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేయాలని అనుకున్నప్పటికీ ఉపాధి అవకాశాలు మాత్రం లేకుండా పోయాయి. ఎక్కడ ప్రయత్నించినా ఉద్యోగం ఇచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. పక్షవాతానికి గురైనప్పటికీ వాచ్ మెన్ గా అయినా అవకాశం ఇస్తే ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు.

స్టేట్ మీట్స్ లో.. ప్రతిభ

రాష్ట్ర స్థాయిలో జరిగిన అధికారిక టోర్నమెంట్లలో పెద్దిరెడ్డి తన ప్రతిభను కనబర్చేవాడు. 10కి పైగా స్టేట్ మీట్స్ లో పాల్గొని వాలీబాల్ క్రీడలో తన ప్రావిణ్యాన్ని చూపించి రాష్ట్ర స్థాయి జట్టు గెలుపులో తనవంతు పాత్రను పోషించేవాడు. అంతేకాకుండా మహదేవపూర్ ప్రాంతానికి పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన పలు టోర్నీలలో కూడా మహదేవపూర్ జట్టు జయకేతనం ఎగురవేయడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించాడు.

పిల్లలు ఉన్నతులుగా…

పెద్దిరెడ్డి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పిల్లలను చదివించే విషయంలో మాత్రం శ్రద్ధ తగ్గలేదు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వారిని చదివించేందుకు మాత్రం ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన బాల సాయి ప్రణీత్ కు ఒరిస్సాలోని రూల్ కెలా ఎన్ఐటీలో సీటు వచ్చింది. నేడో రేపో సాయి ప్రణీత్ ను కాలేజీలో ఫస్టీయర్ లో జాయిన్ చేయాల్సి ఉంది. చిన్న కొడుకు సాయి వినిత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

సాయం వద్దు… ఉపాధే ముద్దు: పెద్దిరెడ్డి

నా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించడం లేదు. నాకు ఉన్న శక్తికి తగ్గట్టు ఉద్యోగం ఇస్తే పనిచేసి వచ్చే జీతం డబ్బులతో నా కుటుంబానికి చేదోడుగా నిలుస్తా. ఆరోగ్యం కూడా బాగా అయినందున వాచ్ మెన్ లాంటి ఉద్యోగం కానీ.. ఇతరత్రా ఉద్యోగాలు కానీ ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను.

Advertisement

Next Story

Most Viewed