లక్ష డబుల్ ఇళ్ళేవి? : ఉత్తమ్

by Shyam |   ( Updated:2020-11-23 10:32:41.0  )
లక్ష డబుల్ ఇళ్ళేవి? : ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే హామీలు నీటి మీద రాతల్లాంటివేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో విడుదలైన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అటకెక్కాయని, ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ వరాలు గుప్పించారని ఉత్తమ్ ఆరోపించారు. గత ఎన్నికలప్పుడే లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటివరకు లబ్ధిదారులకు అప్పగించనేలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత వంద రోజుల ప్రణాళిక అంటూ ఊదరగొట్టిందని, ఇప్పటి రెండు వేల రోజులు దగ్గరవుతున్నా వాటి అమలు ఊసే లేదన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలు, మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వెలువరించిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదని, మాటలే తప్ప చేతల్లేని ప్రభుత్వమన్నారు. హామీలు అమలుపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు బదులివ్వాలని డిమాండ్ చేశారు.

నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో..

కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రూపొందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మంగళవారం ఉదయం గాంధీ భవన్‌లో విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో దాన్ని ప్రస్తావిస్తుందా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.

Advertisement

Next Story