పుస్తక ప్రియుడిగా నాకు తోచిన మాటలివి.. : పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2020-04-23 07:22:23.0  )
పుస్తక ప్రియుడిగా నాకు తోచిన మాటలివి.. : పవన్ కల్యాణ్
X

ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత సామాజిక మాధ్యమం వేదికగా పుస్తక జ్ఞానంపై కొన్ని విలువైన మాటలు చెప్పారు. అంతేకాకుండా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమైన ప్రస్తుత తరుణంలో పుస్తకాలు చదవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

వరుస ట్వీట్లలో ఆయన ఇంకా ఏమన్నారంటే… ‘మానవ జీవితంతో మమేకమైపోయిన పుస్తకం పండుగ నేడు. ఏటా ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా బుక్ డే ను పాఠకులు ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. పుస్తక ప్రియుడిగా నా భావాలను నాలుగు అక్షరాల రూపంలో మీతో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నాను’ అన్నారు. ఇంకా…

‘డబ్బుతో కొనలేని అలౌకిక అందాన్ని అందించేది పుస్తకం.. చేతిలో చిల్లి గవ్వలేకపోయినా విజ్ఞాన సంపన్నునిగా మార్చేది పుస్తకం… దోచుకోడానికి అవకాశంలేని సంపదను ఇచ్చేది పుస్తకం. మనలోని అజ్ఞానాన్ని పారదోలేది పుస్తకం… మన మస్తిష్కాన్ని తాజాగా ఉంచేది పుస్తకం’ అని పేర్కొన్నారు.

‘ఇంతటి మహత్తరమైన శక్తి కలిగిన పుస్తకాన్ని మన దిన చర్యలో భాగం చేద్దాం. ప్రస్తుత స్వీయ నిర్బంధన కాలంలో పుస్తక పఠనం తప్పనిసరిగా చేయండి. మానసిక దృఢత్వాన్ని పెంచుకోండి. పుస్తకాన్ని ప్రేమించండి.. విజ్ఞాన ప్రపంచంలో జీవించండి’ అని పిలుపునిచ్చారు. ఈ ట్వీట్లకు పలు ఫోటోలు జోడించారు. అంతటితో ఆగని కల్యాణ్…

తన రాజకీయ దృక్పథంలో మార్పు తీసుకువచ్చిన ‘ఖారవేలుడు’ పుస్తకం గురించి వివరించే ప్రయత్నం చేశారు. “శిష్టా ఆంజనేయ శాస్త్రి రాసిన ‘ఖారవేలుడు’ పుస్తకంతో నా రాజకీయ ఆలోచన విధానం మార్చుకున్నాను. దేశానికే ప్రథమ ప్రాధాన్యత అని గుర్తించాను. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘జానీ’ ఫ్లాప్ కావడంతో మా రెండో అన్నయ్య నాగబాబు ఈ పుస్తకాన్ని నాకు బహూకరించాడు. ఈ పుస్తకం నాకంటూ ఓ రాజకీయ పంథాను అందించింది” అని తెలిపారు. ఈ ట్వీట్లు ఆయన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంటున్నాయి.

Tags: pawankalyan, janasena, world book day, twitter, book reading

Advertisement

Next Story

Most Viewed