కష్టాలు తెచ్చే రత్నాలు ఎందుకు : Pawan kalyan

by srinivas |   ( Updated:2021-09-27 03:13:03.0  )
కష్టాలు తెచ్చే రత్నాలు ఎందుకు : Pawan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు పవన్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిస్తే మరికొందరు తమకు సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. మెత్తానికి పవన్ వ్యాఖ్యలు అటు రాజకీయంగా.. ఇటు సినీ ఇండస్ట్రీపరంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు.

గత రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామంటున్న మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. ఇష్టానుసారం ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు. సంక్షేమం అసలే కాదన్నారు. అంతేకాదు వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పథకంపైనా సెటైర్లు వేశారు. ‘నవరత్నాలు’ భావితరాలకు నవకష్టాలుగా మారాయని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనను షేర్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు – వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు ఇవిగో అంటూ ప్రభుత్వ హామీలు వాటిపై ప్రభుత్వ చర్యలకు సంబంధించి ఓ జాబితాను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు చేస్తూ పవన్ మరో స్నాప్ షాట్ అప్‌లోడ్ చేశారు.

Next Story

Most Viewed