Sharad pawar: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలి.. శరద్ పవార్

by vinod kumar |
Sharad pawar: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలి.. శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మహారాష్ట్రలోని సాంగ్లిలో మీడియాతో మాట్లాడారు. కోటా కోసం ఉద్యమిస్తున్న మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేసేటప్పుడు, ఇతర వర్గాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం, రిజర్వేషన్లపై పరిమితి 50 శాతం. కానీ తమిళనాడులో 78 శాతం ఉంది. అలాంటప్పుడు మహారాష్ట్రలో 75 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించకూడదు’ అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పరిమితిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఈ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు.

మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) నేతల మధ్య సీట్ల పంపకం చర్చలను వీలైనంత త్వరగా ముగించాలని నేతలకు సూచించారు. ప్రభుత్వంలో మార్పు తీసుకురావడానికి ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఎంవీఏ వారి మనోభావాలను గౌరవిస్తుందని చెప్పారు. మరాఠీ నేర్చుకోవడానికి ఇష్టపడే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కనుక్కోవాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించే అవకాశం ఉందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని 18 ర్యాలీల్లో ప్రసంగిస్తే.. 14 నియోజకవర్గాల్లో ఓడిపోయారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆయన చాలా ర్యాలీల్లో పాల్గొనాలని కోరుకుంటున్నట్టు చమత్కరించారు.

Advertisement

Next Story

Most Viewed