జనసేన అభ్యర్థులను ఆశీర్వదించండి.. పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

by srinivas |
janasena
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి శనివారం కీలక ప్రకటన చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీలకు ఈనెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మిగిలిపోయిన పురపాలక, నగరపాలక సంస్థల్లోనూ పరిషత్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ‘ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక మార్పు కోసం ఈ పోరాటం. జనసైనికులు పదవుల కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తారని ఈ విషయం విజ్ఞులైన ప్రజలకు కూడా తెలుసునని చెప్పుకొచ్చారు. జనసేన అభ్యర్థులను ప్రజలు తమ ఓటుతో ఆశీర్వదించాలి’ అని పవన్ తన ప్రకటనలో కోరారు.

పదవులు కోసం కాదు.. ప్రజా సేవ కోసమే

అన్ని వేళలా ప్రజల కోసం పని చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారికే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాం. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారు. స్థానిక సంస్థలపై అవగాహన, సామాజక స్పృహ కలిగి పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకుంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుంది. మన బిడ్డల పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటు వేసి, ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపించండి

జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఆయా ప్రాంతాల్లో బీజేపీ-జనసేన అభ్యర్థులు ఉమ్మడిగా పోటీ చేసి గెలుపొందింది. తాజాగా జరగబోతున్న నెల్లూరు కార్పొరేషన్ సహా మిగిలిన 12మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను సైతం గెలిపించాలని పవన్ కళ్యాణ్ ప్రకటనలో కోరారు. ‘జనసేనతో మైత్రి ఉన్న బీజేపీ సైతం కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.

మా మిత్రపక్షం బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరుతున్నాను. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, కుప్పం, దర్శి, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, మున్సిపాలిటీలతోపాటు విశాఖ, గుంటూరు కార్పొరేషన్లు, రేపల్లె మున్సిపాలిటీలో ఉప ఎన్నికలు, పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed